
శిల్పా శెట్టి చేతికి హిందుస్తాన్..
న్యూఢిల్లీ: సెలబ్రిటీల జంట శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్(హెచ్‌ఎస్‌జీఐఎల్ ) కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. విడిగా 25.75% చొప్పున వాటాలను కొనుగోలు చేసినట్లు ఈ జంట బీఎస్‌ఈకి వెల్లడించింది. సెప్టెంబర్ 3న ఈ వాటాలను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. కాగా, కంపెనీ షేర్లలో ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి బీఎస్‌ఈలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
ఈ షేరులో చివరిసారిగా రూ. 10.10 ధరలో లావాదేవీలు జరిగాయి. ఇక శిల్పా జంట తరఫున మార్క్ కార్పొరేట్ అడ్వయిజర్స్ మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 12 ధరను చెల్లించనుంది. తద్వారా 26% వాటా కోసం రూ. 95.32 లక్షలు వెచ్చించనుంది.