
‘స్మార్ట్’ రూట్‌లో సిమ్ కార్డ్...
మొబైల్ ఫోన్‌లకు ఊపిరిగా నిలిచే సిమ్ కార్డులు ఇప్పుడు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఈ కొత్తతరం సిమ్‌లను అందిస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లలో మొబైల్స్ ప్రస్థానానికి అనుగుణంగానే ఈ సిమ్‌లు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ మార్పు చెందుతున్నాయి. అయితే, ఇప్పుడు సెల్ ఫోన్లను కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా.. బ్యాంకింగ్, మొబైల్ షాపింగ్ ఇతరత్రా అనేక రోజువారీ కార్యకలాపాలకు కూడా కీలకంగా ఉపయోగించడం పెరుగుతోంది.
స్మార్ట్‌ఫోన్‌ల హవాయే దీనికి ప్రధాన కారణం. దీంతో టెల్కోలు సిమ్‌లకు మరిన్ని హంగులు, ఫీచర్లను జతచేస్తున్నాయి. సబ్‌స్క్రయిబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్‌నే సంక్షిప్తంగా సిమ్‌గా పిలుస్తారు. దీనిలోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లో కస్టమర్లకు సంబంధించిన వివరాలు ఇతరత్రా డేటాను టెల్కోలు నిక్షిప్తం చేస్తాయి. నిర్ధాయక(వెరిఫికేషన్) కోడ్‌లకు అనుగుణంగా యూజర్లు సేవలు పొందేందుకు వీలవుతుంది. సిమ్‌లను ఒకప్పుడు మొబైల్ హ్యాండ్‌సెట్‌లలోనే వాడేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన డాంగిల్స్, ట్యాబ్లెట్స్ పీసీల్లోనూ వీటి వాడకం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ‘వెరిఫికేషన్ కోడ్స్‌తో పాటు ఇప్పుడు సిమ్‌లలో వినియోగదారుల సమాచారానికి మరింత భద్రతను కల్పించేలా టెల్కోలు మార్పులు ప్రవేశపెడుతున్నాయి. సమాచార మార్పిడి వేగంగా జరిగేలా అత్యాధునిక సర్క్యూట్‌లను వాడటం.. మరింత ఎక్కువ డేటా నిల్వ సామర్థ్యం వంటివి కూడా ఇందులో ప్రధానమైనవి’ అని జీఎస్‌ఎం టెలికం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్. మాథ్యూస్ పేర్కొన్నారు.
నయా రూట్: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అనువుగా చిన్న అప్లికేషన్‌లు/యుటిలిటీ ప్రోగ్రామ్(యాప్‌లెట్స్)లను సిమ్‌లలో ముందుస్తుగా నిక్షిప్తం చేసి ఇస్తున్నారని ఐఎంఐ మొబైల్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్) సుదర్శన్ ధరమ్‌పురి చెబుతున్నారు. టెలికం ఆపరేటర్లకు మొబైల్ డేటా ప్లాట్‌ఫామ్ ఇతరత్రా సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ యాప్‌లెట్స్‌ను సిమ్‌లను తీసుకున్న తర్వాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంగీతం, ఇంటర్నెట్ వినియోగం, సెల్ఫ్‌కేర్ అప్లికేషన్లకు ఈ యాప్‌లెట్స్ కీలకంగా నిలుస్తాయని సుదర్శన్ అంటున్నారు. మొబైల్ వినియోగదారుడు తను వినియోగిస్తున్న టారిఫ్ ప్లాన్‌లపై అవగాహన పెంచుకోవడానికి, ఇంటర్నెట్ డేటా వినియోగం, టాప్‌అప్ అవసరాలు వంటివన్నీ ఈ సెల్ఫ్‌కేర్ అప్లికేషన్‌లతో సులువుగా చక్కబెట్టుకోవచ్చు. మాటిమాటికీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం వల్ల అయ్యే వ్యయాలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది కూడా. పోటీని తట్టుకోవడానికి టెల్కోలు అనేక రకాల అప్లికేషన్‌లను సిమ్‌కార్డుల్లో పొందుపరుస్తున్నాయని సీడీఎంఏ, యూనిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్ల సంఘం సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ చెప్పారు.
ప్రస్తుతం స్టాండర్డ్, మైక్రో, నానో ఫార్మాట్‌లలో మూడు రకాల సిమ్ కార్డులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంతోపాటు ప్రీ-లోడెడ్ డేటాతో వస్తున్నాయి. గతంలో 16 కేబీలకే పరిమితమైన డేటా సామర్థ్యం ఇప్పుడు 32 కేబీలకు పెరిగింది కూడా. కొన్ని టెల్కోలు 64 కేబీ సిమ్‌లనూ సరఫరా చేస్తున్నాయి. మరోపక్క అధిక సామర్థ్యం, ఫీచర్లున్న సిమ్ కార్డులను ఇవ్వడం వల్ల టెల్కోలకు వ్యయం పెరుగుతోంది. చాలా కంపెనీలు కొత్త కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిమ్‌లను ఇస్తున్న(కొన్ని సర్కిళ్లు, స్కీమ్‌లు, డేటా యూజర్లకు) విషయం విదితమే.