![Simplify the foreign funding mobilization rules - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/20/RBI.jpg.webp?itok=Zeu1oQ1N)
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలోపేత చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తయారీ రంగంలో కంపెనీలు విదేశీ నిధుల సమీకరించుకోడానికి (ఈసీబీ) సంబంధించిన నిబంధనలను బుధవారం సడలించింది. అలాగే రూపీ డినామినేటెడ్ బాండ్లు (మసాలా బాండ్స్) మార్కెట్‌కూ ఇండియన్ బ్యాంక్‌లకు అనుమతినిచ్చింది. గత శనివారం రూపాయి బలోపేతానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం దీనికి నేపథ్యం. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) నిబంధనల సరళీకరణ కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. తాజా నిర్ణయంపై ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘‘ప్రభుత్వంతో సంప్రతింపుల అనంతరం తాజా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’’ అని ఈ నోటిఫికేషన్‌లో వివరించింది. దీని ప్రకారం...
తయారీ రంగంలో ఉండి విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించుకోడానికి అర్హత ఉన్న కంపెనీలు ఏడాది కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితితో 50 మిలియన్‌ల అమెరికన్ డాలర్లు లేదా అంతకు సమానమైన ఈసీబీలను సమీకరించుకునే వీలుకలిగింది. ఇంతక్రితం కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితి మూడేళ్లుగా ఉండేది.
మసాలా బాండ్ల విదేశీ మార్కెట్‌కూ నిబంధనలలోనూ మార్పులు చేసింది. ఇలాంటి బాండ్స్‌కు ప్రస్తుతం భారత బ్యాంకులు అరేంజర్ లేదా అండర్‌రైటర్‌గా మాత్రమే వ్యవహరించగలుగుతున్నాయి. ఇష్యూ అండర్‌రైటింగ్ సందర్భంలో బ్యాంకుల హోల్డింగ్ ఐదు శాతానికి మించి ఉండడానికి వీల్లేదు. అయితే ఇకపై బ్యాంకులు ఈ బాండ్లకు సంబంధించి కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి అరేంజర్స్, అండర్‌రైటర్స్‌గా ఉండడమే కాకుండా మార్కెట్ మేకర్స్, ట్రేడర్లుగా కూడా వ్యవహరించడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment