
న్యూఢిల్లీ: టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి గానీ.. విస్తరించడానికి గానీ ఆసియాలో అత్యుత్తమమైన నగరంగా బెంగళూరు నిల్చింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ 7వ స్థానం దక్కించుకుంది. ఆసియాలోని సంపన్న, వర్ధమాన దేశాల్లోని 16 నగరాల్లో 50 అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ముంబైకి 10వ స్థానం, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 11వ ప్లేస్ దక్కించుకుంది. సర్వే ప్రకారం ఆసియాలో టెక్నాలజీ కార్యకలాపాల ప్రారంభానికి, విస్తరణకు అత్యధికులు మొగ్గు చూపుతున్న టాప్ నగరాలుగా బెంగళూరు, సింగపూర్, షెంజెన్ ఉన్నాయి. ఆసియాలో టోక్యో తర్వాత మెరుగైన కార్యాలయాల లభ్యత, సంస్థల యాజమాన్యాలకు తక్కువ వ్యయాలతో.. జీవన వ్యయాల విషయంలో చౌకైన టాప్ 10 నగరాల్లో ఒకటిగా బెంగళూరు నిల్చింది. ఓవరాల్‌గా బెంగళూరుకు 68 శాతం స్కోరు వచ్చింది.
వృద్ధి అవకాశాలకు హైదరాబాద్..
వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరంగా హైదరాబాద్ 59 శాతం స్కోరుతో ఏడో స్థానం దక్కించుకుంది. అయితే సామాజిక, ఆర్థిక అంశాల్లో గానీ.. నిపుణుల లభ్యతలో గానీ బెంగళూరుతో పోలిస్తే పోటీలో వెనకబడి ఉంది. అయితే, పన్ను రేట్లు, జీవన వ్యయాలు తక్కువగా ఉండటం.. తదితర అంశాలతో మిగతా నగరాల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment