ఎస్ఎస్టీఎల్లో రష్యా ప్రభుత్వ వాటా కొంటాం
సిస్టెమా జేఎస్‌ఎఫ్‌సీ వెల్లడి
ముంబై: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తన అనుబంధ కంపెనీలో కొంత వాటాను రష్యాకు చెందిన సిస్టెమా జేఎస్‌ఎఫ్‌సీ కంపెనీ కొనుగోలు చేయనుంది. భారత్‌లోని తమ అనుబంధ సంస్థ, సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్(ఎస్‌ఎస్‌టీఎల్)లో 17.14 శాతం వాటాను కొనుగోలు చేస్తామని రష్యా పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సిస్టెమా సోమవారం వెల్లడించింది. రష్యా ప్రభుత్వం నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఈ డీల్ విలువ 77.7 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో ఇన్‌స్టాల్‌మెంట్లలలో రష్యా ప్రభుత్వానికి చెల్లిస్తామని వివరించింది. ఎస్‌ఎస్‌టీఎల్ సంస్థ ఎంటీఎస్ బ్రాండ్ కింద భారత్‌లోని తొమ్మిది టెలికం సర్కిళ్లలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనం కానున్నది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌టీఎల్ విలీన ప్రక్రియ కొనసాగుతోంది. విలీనంతరం ఏర్పడే కంపెనీలో ఎస్‌ఎస్‌టీఎల్‌కు 10 శాతం వాటా ఉంటుందని అంచనా.