ఒడిదుడుకులున్నా పటిష్టమే..!
భారీగా పెరిగిన పసిడి నుంచి లాభాల స్వీకరణ శుక్రవారంతో ముగిసిన రెండవ వారంలోనూ వరుసగా కొనసాగింది. డాలర్ పటిష్టత, ఈక్విటీ మార్కెట్ల స్వల్ప సానుకూలతలు, ఇప్పటికే భారీగా పెరిగిన మెటల్స్ నుంచి లాభాల స్వీకరణ నేపథ్యంలో పసిడి స్వల్పకాలంలో కొంత తగ్గినా... దీర్ఘకాలంలో ఈ మెటల్ బులిష్‌గానే ఉందని ఈ రంగంలోని పలువురు విశ్లేషిస్తున్నారు.
బులిష్ ధోరణికి కారణాలు...
ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ (బ్రెగ్జిట్) విడివడ్డం, అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ బ్యాంక్ 0.50 శాతం పైకి ఫెడ్ ఫండ్ రేటును పెంచలేని పరిస్థితులను విశ్లేషకులు కారణంగా చూపుతున్నారు. ఇక బ్రెగ్జిట్ సమస్యపై తక్షణం దృష్టి సారించకుంటే, మరింత క్లిష్ట పరిస్థితులు తప్పవని ఈవారంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ క్రిస్టినా లెగార్డ్ హెచ్చరించారు. ఇక బ్రెగ్జిట్ కారణాన్నే ప్రధానంగా చూపుతూ 2016, 2017 సంవత్సరాల్లో గ్లోబల్ వృద్ధి రేటును 10 బేసిస్ పాయింట్లు కుదిస్తూ... 3.1 శాతం, 3.4 శాతానికి ఐఎంఎఫ్ ఇదే వారంలో తగ్గించింది. ఇవన్నీ దీర్ఘకాలంలో పసిడి పటిష్టతకు సానుకూల అంశాలేనని నిపుణులు భావిస్తున్నారు.
స్వల్పంగా తగ్గిన రేట్లు...
ఇదిలావుండగా శుక్రవారంతో ముగిసిన సమీక్షా వారంలో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర న్యూయార్క్ కమోడిటీ మార్కెట్-నెమైక్స్‌లో స్వల్పంగా ఔన్స్‌కు (31.1గ్రా)కు ఏడు డాలర్లు తగ్గి, 1,322 డాలర్లకు దిగింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్‌లో పసిడి ధర 99.9, 99.5 స్వచ్ఛత 10 గ్రాములకు స్వల్పంగా రూ.100 తగ్గింది. ఈ ధరలు వరుసగా రూ.30,985, రూ.30,835 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర రూ.730 తగ్గి రూ.46,820కి పడింది.