మారుతీ లాభం 32 శాతం డౌన్‌ | Slowing sales put a big dent in Maruti Q1 net profit | Sakshi
Sakshi News home page

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

Published Sat, Jul 27 2019 5:41 AM | Last Updated on Sat, Jul 27 2019 5:41 AM

Slowing sales put a big dent in Maruti Q1 net profit - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వాహన కంపెనీ మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,377 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండటం, తరుగుదల వ్యయాలు ఎక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.21,814 కోట్ల నుంచి రూ.18,739 కోట్లకు తగ్గిందని తెలిపింది. తరుగుదల, అమోర్టైజేషన్‌ వ్యయాలు రూ.720 కోట్ల నుంచి రూ.919 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నిర్వహణ లాభం 39% తగ్గి రూ.2,048 కోట్లకు తగ్గిందని, మార్జిన్‌ 4.5% తగ్గి 10.4 శాతానికి చేరిందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ 10%కి మించి మార్జిన్‌ను సాధించడం విశేషమని నిపుణులంటున్నారు. కాగా ఈ క్యూ1లో మొత్తం అమ్మకాలు 18 శాతం తగ్గి 4,02,594 యూనిట్లుగా ఉన్నాయని మారుతీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 19 శాతం తగ్గి 3,74,481 యూనిట్లకు చేరాయని, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది.  

రూపాయిల్లో రాయల్టీ చెల్లింపులు...
వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ అమ్మకాలు తగ్గాయని మారుతీ సుజుకీ ఇండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అజయ్‌ సేత్‌ పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో నెలకొన్న మందగమనం తమపై బాగానే ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చక్రీయమేనని వివరించారు. దీర్ఘకాలంలో అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా తమ మాతృ కంపెనీ సుజుకీ మోటార్‌ కార్పొకు రాయల్టీని యెన్‌ కరెన్సీలో చెల్లించామని, రానున్న మూడు సంవత్సరాల్లో రాయల్టీని రూపాయిల్లో చెల్లించనున్నామని  తెలిపారు.  

గ్రామీణ అమ్మకాలు తగ్గుతున్నాయ్‌
గతంలో జోరుగా ఉన్న గ్రామీణ ప్రాంత అమ్మకాలు కూడా తగ్గుతున్నాయని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌. కల్సి పేర్కొన్నారు. భారత్‌ స్టేజ్‌–సిక్స్‌(బీఎస్‌–6) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెస్తామని వివరించారు. బీఎస్‌–సిక్స్‌ వాహనాలను 2020 కల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.   అధికంగా అమ్ముడయ్యే ఐదు మోడళ్లు–ఆల్టో, వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనోలను ఇప్పటికే బీఎస్‌–సిక్స్‌ పర్యావరణ నియమాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తెచ్చామని కల్సి వివరించారు.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేర్‌ 0.7 శాతం లాభంతో రూ.5,806 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.5,685కు పతనమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement