చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి | Small oil and gas fields in the hands of private enterprise | Sakshi
Sakshi News home page

చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి

Published Thu, Sep 3 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి

చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి

69 క్షేత్రాల వేలానికి కేంద్రం నిర్ణయం

♦ వీటిలో నిక్షేపాల విలువ రూ. 70,000 కోట్లు!
♦ కొత్తగా... ఆదాయాల్లో వాటాల విధానం
 
 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న.. ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మరోవైపు, 2006-2011 మధ్య కాలంలో పప్పు ధాన్యాల దిగుమతులపై నాఫెడ్, పీఈసీ, ఎస్‌టీసీ తదితర సంస్థలకు వాటిల్లిన నష్టానికి సంబంధించి రూ.113.40 కోట్లు రీయింబర్స్ చేసేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

 ఇంధన క్షేత్రాల  వేలానికి సంబంధించి.. 69 చిన్న క్షేత్రాల్లో ప్రస్తుత రేట్ల ప్రకారం దాదాపు రూ.70,000 కోట్ల విలువ చేసే 89 మిలియన్ టన్నుల మేర చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో పాటించిన లాభాల్లో వాటాల విధానం కారణంగా ప్రైవేటు ఆపరేటర్లు చేసే ప్రతి వ్యయాన్నీ ప్రభుత్వం పట్టి, పట్టి చూడాల్సి వస్తుండటం... జాప్యానికి, వివాదాలకు దారి తీస్తోందని తెలియజేశారు. ఆదాయాల పంపకానికి సంబంధించి కొత్త విధానం వల్ల చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా, గరిష్ట స్థాయికి ఎగిసినా ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయని ప్రధాన్ వివరించారు. తదుపరి నిర్వహించే లెసైన్సింగ్ రౌండులో కూడా ఇదే విధానాన్ని పాటించే అవకాశాలున్నాయని చెప్పారాయన.

 మూడు నెలల్లో బిడ్ డాక్యుమెంటు..
 వేలంలో ఈ క్షేత్రాలను దక్కించుకునే సంస్థలకు రేటు పరంగాను, మార్కెటింగ్ పరంగానూ పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నియంత్రణ సమస్య లేకుండా ఆయా కంపెనీలు మార్కెట్ రేటుకు ఎవరికైనా విక్రయించుకోవచ్చన్నారు. బిడ్ డాక్యుమెంటు మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని, ఆ తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచడానికి, ఈ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి క్యాబినెట్ నిర్ణయం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు.

 ఇంధన అన్వేషణకు ఇదే సరైన సమయం..
 చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో వేలంపై అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనపరుస్తాయా అన్న ప్రశ్నకు.. టెక్నాలజీ సామర్థ్యం గల చిన్న సంస్థలే లక్ష్యంగా వేలం నిర్వహిస్తామని ప్రధాన్ తెలిపారు. చమురు ధర కనిష్టంగా ఉన్నప్పుడు డ్రిల్లింగ్ రిగ్గు సర్వీసులు మొదలైనవి కూడా తక్కువకే లభిస్తాయి కనుక.. ఇంధన అన్వేషణ కార్యకలాపాలకు ఇదే సరైన సమయమన్నారు. ఈ 69 క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలవడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చని అప్పటికి ధర లు మళ్లీ మెరుగుపడగలవని అంచనా వేస్తున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు.

 వేలం ప్రక్రియ ఇలా..
 నామినేషన్ ప్రాతిపదికన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వద్ద 110 చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలుండేవి. అయితే, భౌగోళిక సంక్లిష్టత, పరిమాణం రీత్యా లాభసాటిగా లేకపోవడం, ప్రభుత్వ నిర్దేశిత రేటు గిట్టుబాటు కాకపోవడం వంటి అంశాల కారణంగా ఉత్పత్తి కుదరకపోవడంతో 63 క్షేత్రాలను ప్రభుత్వానికి కంపెనీ తిరిగి అప్పగించేసింది. ఆయిల్ ఇండియా కూడా ఇదే కారణంగా 6 క్షేత్రాలను వాపసు చేసింది. వీటినే ప్రభుత్వం వేలం వేయబోతోంది. వీటిలో 36 ఆఫ్‌షోర్, 33 ఆన్‌షోర్ క్షేత్రాలున్నాయి. వేలంలో వాటిని దక్కించుకునే కొత్త ఆపరేటరు.. ఇప్పటికే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వాటిపై చేసిన వ్యయాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌షోర్ క్షేత్రాల ఆపరేటర్లు 3 సంవత్సరాల్లో, ఆఫ్‌షోర్ ఆపరేటర్లు నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆయా బ్లాకులపై రాయల్టీ కూడా కట్టాలి. చమురు సెస్సు ఉండదు. లాభాల్లో వాటాల పద్ధతి కాకుండా ప్రభుత్వానికి ఆదాయాల్లో లేదా చమురు, గ్యాస్‌లో ఎంత వాటాలు ఇస్తారన్నది ముందుగా బిడ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. గరిష్ట స్థాయిలో వాటాలు ఇవ్వజూపే సంస్థ.. సదరు క్షేత్రాన్ని దక్కించుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement