
సాక్షి, బిజినెస్ విభాగం : స్మార్ట్.. స్మార్ట్.. అంతా స్మార్ట్ మయం. స్మార్ట్ టీవీల విక్రయాలు జోరుమీదున్నాయి. మరో రకంగా చెప్పాలంటే స్మార్ట్ టీవీ మార్కెట్‌లో చౌక ధరల యుద్ధం ప్రారంభమైంది. షావోమి, థామ్సన్, టీసీఎల్ వంటి గ్లోబల్ కంపెనీలు మన స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర, అధిక ఫీచర్లతో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి.
ఇక్కడ మనం దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 2– 3 ఏళ్లు వెనక్కు వెళ్తే అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ స్థితిగతులను ఎలా మార్చేశాయనే విషయం మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ స్మార్ట్ టీవీ విభాగంలోనూ పునరావృతం కానుంది.
ఇప్పుడు సగం ధరకే!
టాప్ టీవీ బ్రాండ్లు అంటే శాంసంగ్, ఎల్‌జీ, సోనీ ఇవే. ఇప్పుడు వీటి 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.23,000ల నుంచి ప్రారంభమౌతోంది. ఒకప్పుడు వీటి ధర రూ.30,000కు పైగా ఉండేది. అయితే షావోమి, థామ్సన్, టీసీఎల్ వంటి కంపెనీలు రూ.13,500 నుంచే 32 అంగుళాల స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మార్కెట్లోని శాంసంగ్, ఎల్‌జీ, సోనీ ప్రొడక్టుల ధరతో పోలిస్తే ఇది సగానికిపైగా తక్కువ కావడం గమనార్హం.
ధరలో ఈ స్థాయి వ్యత్యాసం ఉండటంతో కొత్త కంపెనీలు మార్కెట్ వాటా లాగేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక 40 అంగుళాల స్మార్ట్ టీవీల విషయానికొస్తే ఇప్పుడు ధర దాదాపుగా రూ.20,000కు తగ్గింది. ఇదివరకు వీటి ధర దాదాపు రూ.50,000లుగా ఉండేది. 32, 40 అంగుళాల టీవీలు ప్రజలకు చేరువ అవడంలో ఫైనాన్స్ సదుపాయం పాత్ర మరువలేనిదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
కంటెంట్ కీలకమే..
స్మార్ట్ టీవీ కొనుగోలులో కంటెంట్ కూడా కీలకమైనదే. ఈ విషయాన్ని గుర్తించిన కొత్త సంస్థలు కస్టమర్లకు కంటెంట్ అందించడానికి హాట్‌స్టార్, వూట్, సోనీ లైవ్, హంగామా వంటి వీడియో ఆన్ డిమాండ్ ఆపరేటర్లతో వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఇక్కడ శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి కంపెనీలకూ వాటి స్మార్ట్‌టీవీ మోడళ్లకు సంబంధించి పలు కంటెంట్ సంస్థలతో ఒప్పందాలున్నాయి.
అయితే కొత్త కంపెనీలు కాస్త దూకుడుగా వెళ్తున్నాయి. దేశీ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయ కంపెనీ షావోమి మరింత కంటెంట్ కోసం దిగ్గజ సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది. తాము కంటెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలతో మాట్లాడుతున్నామని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్/ షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ చెప్పారు.
40 శాతం వార్షిక వృద్ధి
టీవీ మార్కెట్ రూ.50,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే... అందులో స్మార్ట్‌టీవీ విభాగం వాటా సగానికన్నా తక్కువగా 40%గా దాదాపు రూ.20,000 కోట్లు ఉండొచ్చు. అయినప్పటికీ గత రెండేళ్లలో స్మార్ట్ టీవీ మార్కెట్‌లో ఏడాదికి 40 శాతం చొప్పున వార్షిక వృద్ధి రేటు నమోదయింది.
ఇప్పుడు ధరల తగ్గుదల నేపథ్యంలో మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి నమోదు కావొచ్చని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కొత్త కంపెనీలు టీవీల విక్రయానికి ఆన్‌లైన్ ప్లాట్‌పామ్స్‌పై అధికంగా ఆధారపడుతున్నాయి. మొత్తం టీవీ మార్కెట్‌లో పరిమాణపరంగా చూస్తే ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమ్మకాలు 14% వాటా ఆక్రమించాయి. వచ్చే రెండేళ్లలో ఈ వాటా 20%కి పైగా చేరొచ్చని అంచనాలున్నాయి.
పోటీ రసవత్తరం
భారత్‌లోని స్మార్ట్ టీవీ విభాగంలో తమ ఐఫాల్క న్ బ్రాండ్ స్మార్ట్ టీవీల వల్ల పోటీ మరింత పెరుగుతుందని టీసీఎల్ ఓవర్సీస్ బిజినెస్ జనరల్ మేనేజర్ హ్యారీ వు ధీమా వ్యక్తంచేశారు. ‘షావోమి టీవీ బ్రాండ్ ఎంఐకు సాఫ్ట్‌వేర్ నిపుణులున్నారు. అలాగే ఈ–కామర్స్ దన్నూ ఉంది. అయితే దీనికి మా మాదిరి హార్డ్‌వేర్ బ్యాకప్ లేదు. అదీకాక మా సాఫ్ట్‌వేర్ నిపుణులు టెన్‌సెంట్ నుంచి వచ్చారు’’ అని హ్యారీ వివరించారు.
టెన్‌సెంట్ అనేది చైనాలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్, కంటెంట్ కంపెనీ. కంటెంట్ కోసం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఈరోస్‌నౌ, రిలయన్స్ జియో వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. గూగుల్‌తో భాగస్వామ్యం వల్ల యూజర్లు వాయిస్ సెర్చ్ వంటి సదుపాయాన్ని పొందొచ్చని, జియోతో జతకలవడం వల్ల ప్రొడక్టులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం వీలవుతుందని తెలిపారు.
టీసీఎల్ టీవీలను దేశీయంగానే తయారు చేసేందుకు స్థానిక సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, దీంతో టీవీలను మరింత చౌక ధరలకు అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. భారత్‌లో ప్రొడక్టుల తయారీ, మార్కెటింగ్ సేవల కోసం సూపర్ ప్లాస్ట్రోనిక్స్‌తో చేతులు కలిపామని టెక్నికలర్‌లకు చెందిన థామన్స్ బ్రాండ్ మార్కెటింగ్ కార్యకలాపాలు చూసుకునే సెబాస్టియన్ క్రోంబెజ్ తెలిపారు. ఇప్పుడు తాము కూడా స్మార్ట్‌టీవీ మార్కెట్‌పై, ప్రత్యేకించి భారత్‌పై దృష్టి కేంద్రీకరించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment