ఇక ‘ఫేస్‌బుక్‌’ ద్వారా వ్యాపారం | Social Commerce Business Through Facebook | Sakshi
Sakshi News home page

ఇక ‘ఫేస్‌బుక్‌’ ద్వారా వ్యాపారం

Published Mon, Jun 17 2019 3:13 PM | Last Updated on Mon, Jun 17 2019 3:22 PM

Social Commerce Business Through Facebook - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లో కూడా ‘ఈ కామర్స్‌ (ఆన్‌లైన్‌ షాపింగ్‌)’ దుమ్మురేపుతున్న విషయం తెల్సిందే. ఈ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌ డీల్, పేటీఎం మాల్‌ సంస్థలు రాణిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీల ద్వారా ఐదు కోట్ల మంది భారతీయ వినియోగదారులు మాత్రమే తరచుగా కొనుగోళ్లు చేస్తున్నారట. అందుకని ఇప్పుడు ‘సోషల్‌ కామర్స్‌ (సామాజిక వాణిజ్యం)’ అంటే ఫేస్‌బుక్, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా సంస్థల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం. ఫేస్‌బుక్‌కు దాదాపు 25 కోట్ల మంది యూజర్లు ఉండడంతో వారిని వినియోగదారులుగా చేసుకొని సరికొత్త ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ‘మీషో’ పుట్టుకొచ్చింది. ‘మేరీ షాప్‌’ అనే హిందీ అర్థానికి స్వల్పరూపమే మీషో.

ఇందులో కోట్ల డాలర్ల పెట్టుబడులు ‘ఫేస్‌బుక్‌’ పెట్టినట్లు తెల్సింది. అయితే వాటి వివరాలను వెల్లడించేందుకు ఆ సంస్థ నిరాకరిస్తోంది. గతేడాది నాటికే మీషో 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఫేస్‌బుక్‌తోపాటు మరి కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. యూజర్ల డేటాను అమ్ముకున్నట్లు భారత ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఫేస్‌బుక్, భారత్‌ స్టార్టప్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ఆ సంస్థకు లాభించే అంశం.

మీషో వ్యవస్థాపకులు
ఢిల్లీలోని ఐఐటీలో 2008–2012 బ్యాచ్‌మేట్లయిన 27 ఏళ్ల విదిత్‌ ఆత్రే, 28 ఏళ్ల సంజీవ్‌ బార్వల్‌ బెంగళూరు కేంద్రంగా మీషోను స్థాపించారు. పెద్ద పెద్ద మాల్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని నిర్వహించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ఇప్పుడు చిల్లర వ్యాపారులను కూడా తనలో చేర్చుకుంది. చిల్లర వ్యాపారులు తమ వస్తువులను ఈ సంస్థల ద్వారా అమ్ముకోవచ్చు. వారికంటూ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌గానీ, ‘యాప్‌’ గానీ ఏదీ లేదు. వారినందరిని ఓ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెస్తే, సోషల్‌ మీడియాకు వారిని లింక్‌ చేస్తే ఎలా ఉంటుందన్న విదిత్, సంజీవ్‌ల ఆలోచనలకు రూపమే ‘మీషో’. ఈ చిల్లర వ్యాపారులు తమ కొత్త ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను ఫేస్‌బుక్‌లో షేర్‌చేసుకునే అవకాశం కూడా ఉందని వారన్నారు. ఇక భవిషత్తంగా ‘సోషల్‌ కామర్స్‌’దేనని వారు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement