స్కోరు బాగుంటేనే ‘క్రెడిట్’ | socre as nice then credit | Sakshi
Sakshi News home page

స్కోరు బాగుంటేనే ‘క్రెడిట్’

Published Mon, Oct 19 2015 1:33 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

స్కోరు బాగుంటేనే ‘క్రెడిట్’ - Sakshi

అప్పు కావాలంటే ఏ బ్యాంకయినా, ఆర్థిక సంస్థయినా చూసేది సిబిల్ స్కోరే. ఆ స్కోరు బాగుంటే ఓకే. లేదంటే రుణం చేతిదాకా వచ్చి ఆగిపోతుంటుంది. అందుకే ఆ స్కోరును ఎలా మెరుగుపరచుకోవాలనేది ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందోర్కర్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
 
* రుణాల వాయిదాల చెల్లింపుల్లో జాగ్రత్త
* ఆలస్యం, చెల్లించకపోవటం మొదటికే మోసం
* ఎడాపెడా లోన్లకు దరఖాస్తులు చేసినా నష్టమే
* దరఖాస్తుకు ముందు స్కోరు చూసుకోవటం బెటర్
ఈ దసరా పండుగకి మాంచి ఎల్‌ఈడీ టీవీ తీసుకుందామనుకున్నారు కొత్త జంట ఆనంద్, రాధ. ఇద్దరూ కలసి ఇంటికి దగ్గర్లోని ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌కి వెళ్లి అన్ని బ్రాండ్స్‌ను చూశారు. ఒకటి నచ్చింది. తీరా రేటు చూశాక తెలిసింది. అది వారి బడ్జెట్‌ను మించిపోయిందని. ఇద్దరూ కాస్త నిరాశపడి... మరికొంత పొదుపు చేశాక కొందాంలే అనుకుంటూ వెనుదిరిగారు.

అక్కడితో అయిపోలేదు కథ. విషయం తెలుసుకున్న సేల్స్‌పర్సన్ వారిద్దరినీ ఆపాడు. వారు కోరుకునే ప్రోడక్టును కొనుక్కునేందుకు ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పాడు. అంతేగాకుండా స్టోర్‌లోనే ఉన్న ఫైనాన్సింగ్ కంపెనీ ప్రతినిధిని వారికి పరిచయం కూడా చేశాడు. ఎల్‌ఈడీ టీవీ కొనుగోలుకు సరిపడేంత లోన్ తక్షణమే పొందే వీలుందని తెలియడంతో ఆనంద్, రాధ ఊపిరి పీల్చుకున్నారు. లోన్ అప్లికేషన్ ఫారంను ఆనంద్ చకచకా నింపేశాడు. ఆ ప్రతినిధి అడిగిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడు. వాటి ఆధారంగా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి అప్పటికప్పుడు ఆనంద్ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీని ఆన్‌లైన్లో పరిశీలించాడు. ఆనంద్ క్రెడిట్ స్కోరు రుణం ఇవ్వతగిన స్థాయిలో ఉందని ధ్రువీకరించుకుని, లోన్‌ను ప్రాసెస్ చేశాడు. అలా ఆనంద్, రాధ తాము కోరుకున్న ఎల్‌ఈడీని కొనుక్కోగలిగారు.
 
చిరుద్యోగి అయినప్పటికీ...
ఆనంద్ చేసేది చిరుద్యోగమే. అయినప్పటికీ తనకు మంచి క్రెడిట్ స్కోరు ఉండటంతో లోన్ ఈజీగా మంజూరయింది. క్రెడిట్ కార్డులు, హోమ్ లోన్‌లు మొదలైనవి తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోరు అవసరమని ఆనంద్‌కి కొంత ఐడియా ఉన్నప్పటికీ.. దాని ప్రాధాన్యం మాత్రం అప్పుడే తెలిసింది. ఎంతో ఇష్టపడిన టీవీ కోసం మరో ఏడాది ఆగకుండా అప్పటికప్పుడు తీసుకోవడానికి తన క్రెడిట్ స్కోరే ఉపయోగపడిందని అర్థమైంది.దీంతో ఆనంద్, రాధ.. ఆర్థిక  క్రమశిక్షణ ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉండటానికి తమంతట తాము కొన్ని నిబంధనలు విధించుకున్నారు. ఇవి వాళ్లిద్దరే కాదు. అందరూ పాటించదగ్గవే. అవేమిటంటే...
 
ఎడాపెడా దరఖాస్తులు...
అప్పుడప్పుడు మీకు బ్యాంకుల్లోను, ఇతర ప్రాంతాల్లోను క్రెడిట్ కార్డు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తారసపడుతుంటారు. తమ కంపెనీ క్రెడిట్ కార్డు ఇస్తామని, వాటి వల్ల చాలా లాభాలున్నాయని చెబుతారు. కంపెనీ ప్రతినిధే ఇస్తామంటున్నాడు కదా పోయేదేముందని మీరొక దరఖాస్తు పడేస్తారు. అడిగిన ద్రువపత్రాలన్నీ ఇస్తారు. తను కూడా అప్లయ్ చేస్తాడు. కాకపోతే మీ క్రెడిట్ స్కోరు సరిగా లేకుంటే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

సరే! జిరాక్స్ కాపీలిచ్చాం... అంతేకదా! అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఇలా ఎన్ని దరఖాస్తులు రిజక్ట్ అయితే అంత క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందన్న మాట. ఇలా ఐదారు దరఖాస్తులు తిరస్కరణకు గురైతే క్రెడిట్ స్కోరు దారుణంగా పడిపోతుందని గుర్తుంచుకోవాలి. అందుకే రుణాలకు గానీ, క్రెడిట్ కార్డులకు గానీ అవసరం లేకుండా ఎడాపెడా దరఖాస్తులు చెయ్యొద్దు.
 
ఎప్పటికప్పుడు సమీక్ష..
అందుకే క్రెడిట్ కార్డు, రుణాలు మొదలైన వాటికి దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి క్రెడిట్ స్కోరు, హిస్టరీ చూసుకోవడం మంచిది. ఇవి బాగున్నాయంటే మన దరఖాస్తులు సక్రమంగా ప్రాసెస్ అవుతాయి. ఒకవేళ లోటుపాట్లేమైనా ఉంటే స్కోరు మెరుగుపర్చుకోటానికి తగు చర్యలు తీసుకోవచ్చు. ఆ తర్వాత సులభంగా లోన్ దొరుకుతుంది. కాబట్టి ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే... క్రెడిట్ స్కోరు వివరాలతోనే మన ఆర్థిక క్రమశిక్షణపై ఫైనాన్సింగ్ సంస్థలు ఒక అంచనాకు వస్తాయి. ఇది బాగుంటేనే రుణమూ, క్రెడిట్ కార్డూ లాంటివి తీసుకోవడం వీలవుతుంది. కనుక..క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి.
 
ఇతరుల రుణాలకు హామీ ఇస్తే..
ఒకోసారి ఇతరులు తీసుకునే రుణాలకు మనం పూచీకత్తు ఇస్తుంటాం. అలాంటప్పుడు... ఆ లోన్ తీసుకున్న వారు ఎగ్గొట్టకుండా సరిగ్గా కడుతున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అప్పు తీసుకున్న వారు సరిగ్గా కట్టకపోయినా లేదా ఎగ్గొట్టినా... దానికి పూచీకత్తునిచ్చిన గ్యారంటార్ క్రెడిట్ హిస్టరీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
 
పేమెంట్ అలర్టులు...
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు గడువు తేదీని ఒకోసారి మర్చిపోయే అవకాశముంది. ఇది తరచూ జరిగితే ఆర్థికంగా అదన పు భారం పడటంతో పాటు క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతింటుంది. కనుక, ఇలా జరగకుండా ఫోన్‌లో లేదా ఈ-మెయిల్‌లో అలర్ట్‌లు పెట్టుకుంటే మంచిది. అంతేకాక చెల్లింపులకు చివరి రోజు వరకూ ఆగొద్దు. ముందే చెల్లిస్తే మంచిది.
 
సకాలంలో చెల్లింపులు..
క్రెడిట్ కార్డులపై వాడిన మొత్తాలు కావొచ్చు, లేదా ఇతరత్రా ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు కావొచ్చు... ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐలను ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు. వాయిదాలు కూడా వేయొద్దు. సకాలంలో చెల్లించేయాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement