మరిన్ని కష్టాలతో ప్రవేశపెట్టాం | somany problems arer there in budget | Sakshi
Sakshi News home page

మరిన్ని కష్టాలతో ప్రవేశపెట్టాం

Published Fri, Mar 13 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

మరిన్ని కష్టాలతో ప్రవేశపెట్టాం

మరిన్ని కష్టాలతో ప్రవేశపెట్టాం

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ కష్టాలుంటూనే ఉంటాయని, ఈసారి మరిన్ని కష్టాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. తనది వాస్తవిక బడ్జెట్ అని పేర్కొన్నారు. తమ దగ్గర ఆదాయం తక్కువగా ఉందని, దాని ఆధారంగా కేటాయింపులు చేశామని చెప్పారు. అప్పులు తెచ్చుకోకపోతే రాష్ట్రంలో పథకాలను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన అనంతరం యనమల అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరులతో మాట్లాడారు.

ఇందులో ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు మేడా మల్లికార్జునరెడ్డి, కూన రవికుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్‌కల్లాం, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉంటే వెంటనే వెళ్లి భోజనం చేయండి అని ఒక విలే కరి ప్రశ్నకు సమాధానంగా యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, వారు పొందుపరిచిన లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి వివరిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ఆదాయాల మధ్య తేడా ఉందన్నారు. ‘‘రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువగా కష్టాలు వివరించాం. పక్క రాష్ట్రాలకు, మనకు ఉన్న తేడా కూడా చెప్పాం.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి ఎలా ఉందో పోల్చిచూశాం. మన కష్టాల ఆధారంగా కేంద్రానికి విన్నపాలు చేసి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరతాం’’ అని తెలిపారు. రెండు రాష్ట్రాల బడ్జెట్‌లను పరిశీలిస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉందో కేంద్రం గుర్తించేందుకు తేలికవుతుందన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో కేంద్రానికి లేఖ రాస్తారని ఆయన చెప్పారు. ఏపీలో జనాభా, సమస్యలు, ఆర్థికలోటు ఎక్కువగా ఉందని, అందువల్లే సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ర్టం అన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నపుడు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేజీ బేసిన్ రాష్ట్రంలో ఉంది కాబట్టి.. దీనిపై రాయల్టీని కోరుతున్నామని, లేదంటే గ్యాస్ బావులను రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
 
యనమల ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికేతర వ్యయాన్ని సాధ్యమైనంతగా తగ్గించాం.

తాజాగా 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన చేయూత తర్వాత కూడా రాష్ర్టం 2019-20 సంవత్సరంలోనూ ఆర్థికలోటుతో ఉంటుంది.

పన్నులద్వారా ఆదాయాన్ని పెంచలేం. అందువల్ల పన్నేతర ఆదాయం.. అంటే ఎర్రచందనం అమ్మకం, ఖనిజాల వెలికితీత ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నాం.

అటవీశాఖపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చులో సగం మాత్రమే ఆదాయం వస్తోంది. అందువల్లే ఈసారి ఆ శాఖ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.

ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఒక విధానాన్ని కనుగొనే పనిలో ఉన్నాం.

రాజధాని నిర్మాణానికి రూ.వెయ్యికోట్లు ప్రతిపాదించాలని పట్టణాభివృద్ధిశాఖకు సూచిస్తే వారు రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. పట్టణాభివృద్ధికి కేటాయించిన మొత్తంలో రాజధానికి కేటాయింపులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతులకు చెల్లించేందుకు రూ.60 కోట్లు మంజూరు చేశాం.

పోలవరం ప్రాజెక్టుకు రూ.వెయ్యికోట్లు కేటాయించాం.  దాన్ని ఖర్చుచేస్తే కేంద్రం తిరిగిస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఇతర ప్రాజెక్టులకు ఖర్చుచేస్తాం.

నీటిపారుదల శాఖకు కేటాయించిన బడ్జెట్‌ను ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసేందుకు ఖర్చు చేస్తాం.

పౌరసరఫరాలశాఖ జారీచేసే కార్డులకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల 15 శాతం అనర్హులను తగ్గించగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప్రక్రియను అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయం మిగులుతుంది.

వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు ప్రాధాన్యతనిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement