
నగదు రహితం.. మంచిదే!
పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి దేశంలో నగదు లావాదేవీల స్వరూపమే మారిపోయింది. సామాన్యులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడుతున్నారు. దీంతో మున్ముందు నగదురహిత లావాదేవీల ప్రాధాన్యం మరింత పెరగనుంది. సాధారణంగా ఆర్థికాంశాలన్నీ ఎక్కడో ఒక దగ్గర పన్నులతోనే ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పన్నులకు సంబంధించి నగదురహిత లావాదేవీల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియజేసే ప్రయత్నమే ఈ కథనం.
ఆదాయ పన్ను చెల్లింపులు పెరుగుతాయి
నగదు రహిత లావాదేవీలన్నీ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉండటం వల్ల లావాదేవీల మూలాలను ఇట్టే గుర్తించవచ్చు. కాబట్టి ఎవరూ కూడా తమ ఆదాయాలను దాచి పెట్టే అవకాశం ఉండదు. పైగా ప్రతి ఒక్కరి అకౌంటును పాన్, ఆధార్ నంబరుతో అనుసంధానం చేయడం వల్ల ఎవరిదగ్గర ఎంత మొత్తం ఉందన్నది సులువుగా కనిపెట్టేయొచ్చు. కనుక.. ఆదాయాన్ని తక్కువ చూపించడం, తక్కువ ఆదాయ పన్ను కట్టడం వంటివి కుదరవు. దీంతో.. మరింత మంది ప్రజలు వాస్తవంగా కట్టాల్సినంత పన్ను కట్టక తప్పదు.
ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల చెల్లింపుల పెరుగుదల
వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా.. కంపెనీలు, కార్పొరేట్లు నిర్వహించే ఆర్థిక లావాదేవీల్లోనూ డీమోనిటైజేషన్ పారదర్శకత పెంచింది. నగదు లావాదేవీల పరిమాణం తగ్గింది. కార్డు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు పెరిగాయి. ఇది ఆయా కంపెనీల అకౌంటింగ్ పుస్తకాల్లో కూడా పారదర్శకత పెరిగేందుకు దోహదపడుతుంది. ఆ రకంగా అవి వాస్తవంగా కట్టాల్సినంత ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్నులు కూడా కచ్చితంగా కడతాయి. ఈ పన్ను చెల్లింపులు పెరుగుతాయి.
భవిష్యత్‌లో పరోక్ష పన్నుల తగ్గుదల
అక్రమంగా డబ్బు కూడబెట్టడాన్ని నిరోధించడం, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా తమ ఆదాయాలను వెల్లడించి.. కట్టాల్సిన పన్నులు కట్టేలా చూడటమే డిజిటల్, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఆదాయ పన్నుల చెల్లింపులు పెరిగే కొద్దీ ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దీంతో మనం కొనుగోలు చేసే వస్తువులు, సర్వీసులపై చెల్లించే పరోక్ష పన్నుల వడ్డింపు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రజల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు కూడా కొంత పెరగవచ్చు.
పన్ను మినహాయింపులు
నగదురహిత లావాదేవీలను ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం.. పలు సర్వీసులపై చార్జీలు మొదలైన వాటికి మినహాయింపులు ప్రకటించింది. రూ. 2,000 దాకా చెల్లింపులు కార్డు ద్వారా చేస్తే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపునిస్తోంది. అలాగే నెట్ బ్యాంకింగ్ లేదా కార్డుల ద్వారా రైలు టికెట్లు, హైవే టోల్, పెట్రోల్.. డీజిల్ మొదలైనవాటికి చెల్లింపులు చేస్తే కనిష్టంగా 0.5 శాతం మేర లావాదేవీ మొత్తంపై డిస్కౌంటు ప్రకటించింది. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లిస్తే కొంత డిస్కౌంటు ఉంటోంది. సింహభాగం నగదు వాడకమే ఉన్న దేశం.. రాత్రికి రాత్రే నగదురహిత లావాదేవీలకు మారిపోవడం అంత సులభమైన వ్యవహారమేమీ కాదు.
ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. అంతా సర్దుకునేందుకు కాస్త సమయం పడుతుంది. దైనందిన జీవితంలోని ఇతరత్రా లావాదేవీలతో పాటు పన్నులు కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ప్రాధాన్యమైన అంశమే. ఎందుకంటే ఖర్చు చేయగలిగేంత నగదు చేతిలో ఉండటమనేది ... పన్నులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఏదైతేనేం..క్యాష్‌లెస్ లావాదేవీల వల్ల చోటు చేసుకునే అత్యంత కీలకమైన పరిణామం ఏదైనా ఉందంటే.. అది ఆదాయ పన్నుల వసూళ్లు పెరగడమే. భవిష్యత్‌లో పన్నులు తగ్గేందుకు, కొనుగోలు శక్తి పెరిగేందుకు ఇదే దోహదపడే అవకాశం ఉంది.