
మళ్లీ తగ్గిన విమాన చార్జీలు.. రూ. 1899కే టికెట్
చవక విమాన టికెట్లు అందించే స్పైస్ జెట్ సంస్థ మళ్లీ పరిమిత కాల ఆఫర్ను ప్రకటించింది. స్వదేశీ విమానయాన మార్గాల్లో రూ. 1899కే టికెట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 'రెడ్ హాట్ ఫేర్స్' అనే ఆఫర్ కింద పన్నులన్నింటినీ కలుపుకొని కూడా టికెట్ ధరను రూ. 1899గా ప్రకటించింది. ముంబై-గోవా, అహ్మదాబాద్- ముంబై, బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, పుణె-బెంగళూరు మార్గాలతో పాటు మరిన్ని మార్గాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్ జెట్ వర్గాలు తెలిపాయి.
మూడురోజుల పాటు అందుబాటులో ఉండే ఈ టికెట్ బుకింగులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 8వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి వరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. స్పైస్ జెట్ వెబ్సైట్ ద్వారాను, ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్పైస్ జెట్ కాల్ సెంటర్లో గానీ, ఎయిర్పోర్ట్ టికెట్ కార్యాలయాల్లో గానీ మాత్రం ఈ ఆఫర్ టికెట్లు దొరకవు.