హైదరాబాద్–కొలంబో మధ్య శ్రీలంకన్ సర్వీసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్–కొలంబో మధ్య విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. కొలంబోలో ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి ఉదయం 8.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఉదయం 9.50కి తిరుగు ప్రయాణమై 11.45కు కొలంబోలో విమానం దిగుతుంది. జూలై 16 నుంచి కోయంబత్తూరు నుంచి కొలంబోకు సర్వీసు మొదలు పెడుతోంది. దీంతో భారత్‌లో 14 నగరాల్లో అడుగు పెట్టినట్టు అవుతుందని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శివ రామచంద్రన్ బుధవారం మీడియాకు తెలిపారు.
దేశంలో వారానికి 126 సర్వీసులు నడిపిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎమిరేట్స్ తర్వాత ఈ స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ప్రయాణికుల సంఖ్య అధికమైతే సర్వీసులు పెంచుతామన్నారు. ‘2016లో 20 లక్షల మంది విమాన ప్రయాణికులు శ్రీలంకలో అడుగుపెట్టారు. వీరిలో భారత్ నుంచి 18 శాతం మంది ఉన్నారు. సంస్థ విమానాల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి’ అని వివరించారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.