నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు
అత్యవసర సేవలు మినహాయించాలని నిర్ణయం
కోల్‌కతా ఘటనపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవల బంద్‌కు ఐఎంఏ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.
శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు.
మంత్రి దామోదర సంఘీభావం
డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు.
ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా
సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘం
ఉత్తరాఖండ్‌లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment