![రియో ఒలంపిక్స్ కు స్టార్ ఇండియా సిద్ధం! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41466149868_625x300.jpg.webp?itok=_euTy0ye)
రియో ఒలంపిక్స్ కు స్టార్ ఇండియా సిద్ధం!
ప్రపంచ క్రీడా సంరంభానికి స్టార్ ఇండియా సర్వం సిద్ధం చేసింది. క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు వీలుగా 24x7 ప్రసారాలతో సమాయత్తమవుతోంది. మొత్తం 34 చానెల్స్.. వాటిలో 8 చానెల్స్ పూర్తిగా క్రీడా ప్రేమికులకోసమే. అవును...ఎప్పటినుంచి అనుకుంటున్నారా.. ఇంకా 49 రోజుల తర్వాత.. అంటే ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లో జరగబోయే రియో ఒలంపిక్స్ ప్రారంభతేదీ నుంచి ఈ ఒలంపిక్స్ ను 24x7 లు క్రీడాభిమానులు వీక్షించేలా ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎనిమిది చానెల్స్ ను పూర్తిగా రియో ఒలంపిక్స్ ప్రసారాలకు కేటాయిస్తున్నామని స్టార్ ఇండియా గురువారం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో రియో ఒలంపిక్స్ ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ రెండూ కలిసి ఒలంపిక్స్ ను 3000 పైగా గంటలపాటు లైవ్ కంటెట్ ప్రసారం చేసేలా నిర్ణయం తీసుకున్నాయి.
'ఒలంపిక్స్ అనేది బహుళ క్రీడా వేడుక. ఈ వేడుకల్లో భారత్ క్రీడాకారులు చాలా మంది పాల్గొంటుంటారు. భారత క్రీడాభిమానులకు ఈ వేడుకలో జరగబోయే క్రీడలను గురించి సమగ్ర సమాచారం అందించడానికి తోడ్పడతాం.. 24x7 బేసిస్ తో ఎనిమిది చానెల్స్ ను ఈ అపూర్వమైన ప్రదర్శన ఇవ్వడానికే కేటాయించాం.. మొదటిసారి రెండు భాషల్లో ఈ వేడుకను ప్రసారం చేయబోతున్నాం.. ' అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా తెలిపారు. యాడ్ సపోర్టుతో హాట్ స్టార్ లో ఒలంపిక్స్ కంటెట్ లను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఎక్స్ క్లూజివ్ గా ఎలైట్ ప్యానెల్ తో పాటు, భారత స్పోర్ట్స్ నిపుణులను ఏర్పాటుచేసి, ఒలంపిక్స్ గురించి విశ్లేషణ, కామెంటరీ, అభిప్రాయాలను క్రీడాభిమానులతో షేర్ చేసుకునేలా లైవ్ ప్రోగ్రామ్ లు చేపడతామన్నారు.