సాక్షి,న్యూఢిల్లీ: ఈ ఉద్యోగాన్ని మీరు ఎందుకు కోరుకుంటున్నారు..? అభ్యర్థులను కంపెనీలు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి ఉద్యోగార్థులు సరైన వివరణను ఇవ్వలేకుంటే వారికి కంపెనీలో చోటుండదు. ఆర్థిక సేవల సంస్థ జెరోదా నియామకాల్లో అనుసరిస్తున్న పద్థతి ఇది. డాక్స్‌యాప్, హ్యాకర్‌ఎర్త్, ఫార్మాసీ, కార్యా, ఫ్లెక్సస్ ఎండీ వంటి పలు స్టార్టప్‌లు నియామకాల సందర్భంగా అభ్యర్థులు ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు.. ఈ జాబ్ పట్ల వారి నిబద్ధత, దీర్ఘకాలం పనిచేయగలరా అనే కోణాల్లో అభ్యర్ధులను వడపోస్తున్నాయి. 2020 నాటికి దేశంలో 10,500కి పైగా స్టార్టప్‌లు వస్తాయని వీటిలో రెండులక్షల మందికి పైగా నియామకాలుంటాయని నాస్కామ్-జిన్నోవ్ సర్వే అంచనా వేస్తోంది.
హైరింగ్ సందర్భంగా ఉద్యోగార్ధులు కొన్ని కఠిన ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈ సర్వే సూచించింది. ఆయా కంపెనీల లక్ష్యాలు, కంపెనీ దీర్ఘకాల వృద్ధికి ఎలా దోహదపడగలరనే ప్రశ్నలపై అభ్యర్ధులు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కంపెనీ లక్ష్యాలు పట్ల అవగాహన కలిగి, నిబద్ధత ఉన్న అభ్యర్ధులను ఆయా కంపెనీల వ్యవస్థాపకులు ఎంచుకోవాలని బెంగుళూరుకు చెందిన వెంచర్ ఫండ్ ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ ఎండీ శ్రీపతి ఆచార్య పేర్కొన్నారు. ఇక మరికొన్ని సంస్థలు దీర్ఘకాలంగా తమతో కొనసాగే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. టాటా సన్స్ అధినేత రతన్ టాటా నుంచి ఫండ్ అందుకున్న దుస్తుల బ్రాండ్ కార్యా చురుకుగా ఉండే ఉద్యోగులను నియమించుకుంటోంది.
నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న వారిని హైర్ చేస్తున్నామని సంస్థ సీఈవో నిధి అగర్వాల్ చెప్పారు. దీర్ఘకాలం సంస్థతో ముందుకు సాగే వారికే స్టార్టప్‌ల ప్రాధాన్యతగా ముందుకొస్తోంది. ఇంటర్వూ‍్యల్లో అభ్యర్ధుల మనోబలానికీ మరికొన్నిసంస్థలు పదునుపెడుతున్నాయి. సంస్థ ఇబ్బందుల్లో పడితే వేతనం తగ్గించుకుని పనిచేసేందుకు సిద్ధమా అంటూ ఉద్యోగార్ధుల ఉద్దేశాలను తెలుసుకునేందుకు పరీక్షిస్తున్నాయి.స్టార్టప్‌ల్లో వినూత్న పనితీరుతో పాటు దూకుడుగా, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేవారికి మెరుగైన ఆదరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment