
న్యూఢిల్లీ: స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర రూ.780తో పోల్చితే బీఎస్‌ఈలో ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.700 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.755, రూ.691 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.725 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 3 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 45 లక్షల మేర షేర్లు ట్రేడయ్యాయి. మంగళవారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,632 కోట్లుగా నమోదైంది. ఇటీవలే ముగిసిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,125 కోట్లు సమీకరించింది. రూ.775–780 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 92 శాతం మాత్రమే సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్ ఇండియా, డాషే ఈక్విటీస్ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ సెక్యూరిటీస్ ఇండియా సంస్థలు వ్యవహరించాయి.