న్యూఢిల్లీ: సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ప్రకటిత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం రెండో దశలో 11 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో రిలయన్స్, ఫస్ట్ సోలార్, ఇండోసోల్ తదితరాలున్నాయి. మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. పథకంలో భాగంగా ఇందుకు రూ. 14,007 కోట్లు వెచ్చించనుంది. అత్యధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రెండో దశలో భాగంగా విద్యుత్ శాఖ తాజా ప్రాజెక్టులను కేటాయించింది.
వీటిలో 7,400 మెగావాట్లు 2024 అక్టోబర్‌కల్లా ప్రారంభంకావచ్చని అంచనా. ఈ బాటలో 2025 ఏప్రిల్‌కల్లా 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌కు మరో 15,400 మెగావాట్లు సిద్ధంకానున్నట్లు అంచనా. వెరసి రెండో దశలో భాగంగా మొత్తం రూ. 93,041 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి. అంతేకాకుండా 1,01,487 ఉద్యోగాల సృష్టికి అవకాశముంది. వీటిలో 35,010 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 66,477 పరోక్షంగా లభించే వీలుంది.
కంపెనీల వివరాలు
పాలీసిలికాన్, ఇన్‌గాట్ వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్ బాస్కెట్‌లో రిలయన్స్, ఇండోసోల్ విడిగా 6,000 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టులను పొందాయి. ఈ బాటలో ఫస్ట్ సోలార్ 3,400 మెగావాట్లను పొందింది. వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ బాస్కెట్‌లో వారీ 6,000 మెగావాట్లు, రీన్యూ 4,800 మెగావాట్లు, అవాడా 3,000 మెగావాట్లు, గ్రూ 2,000 మెగావాట్లు, జేఎస్‌డబ్ల్యూ 1,000 మెగావాట్ల ప్రాజెక్టులు పొందాయి. ఇక సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌లో టాటా పవర్ సోలార్ 4,000 మెగావాట్లు, విక్రమ్ 2,400 మెగావాట్లు, యాంపిన్ 1,000 మెగావాట్లు చొప్పున ప్రాజెక్టులు అందుకున్నాయి.
హైటెక్నాలజీతో..
హై టెక్నాలజీ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ వేల్యూ చైన్‌లో దేశం బలపడుతున్నట్లు పీఎల్‌ఐ పథ కం విజయంపై స్పందిస్తూ విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. తాజా సామర్థ్య విస్తరణ ద్వారా సోలార్ తయారీ రంగంలో దేశం స్వావలంబన దిశగా భారీ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశా రు. కాగా.. పథకం తొలి దశలో భాగంగా 2022 నవంబర్–డిసెంబర్‌లో 8,737 మెగావాట్ల సమీకృత సామర్థ్య ప్రాజెక్టులను కేటాయించింది. వెరసి పీ ఎల్‌ఐ పథకం రెండు దశల్లో కలిపి మొత్తం 48,337 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించింది. రూ. 18,500 కోట్లకుపైగా ఆర్థిక మద్దతు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment