స్టాక్స్ వ్యూ | Stocks Overview | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్య

Published Mon, Aug 31 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

Stocks Overview

బ్రిటానియా ఇండస్ట్రీస్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,974 టార్గెట్ ధర: రూ.3,650 
ఎందుకంటే: భారత బిస్కట్ మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. గుడ్ డే, మారీ, టైగర్, క్రీమ్ ట్రీట్, 50-50, మిల్క్ బికీస్, న్యూట్రి చాయిస్ బ్రాండ్లతో విక్రయాలు సాగిస్తోంది. అమ్మకాలు, నిర్వహణ పనితీరు బాగా ఉండడం వంటి కారణాల వల్ల  వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రకరకాలైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడం వంటి కారణాల వల్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధిస్తున్నాయి.

రస్క్‌లు, కేక్‌ల కేటగిరిలోకి ప్రవేశించిన ఈ కంపెనీ డైరీ, ఇతర స్నాక్స్ కేటగిరిల్లోకి కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. బ్రేక్ ఫాస్ట్ సంబంధిత ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. 2012-15 కాలానికి రాబడులు 50 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి.  2013-15 కాలానికి ఆదాయం 13 శాతం చొప్పున, నికర లాభం 45 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. కీలక ముడి పదార్ధాల ధరలు గోధుమ పిండి 8 శాతం, పంచదార 10 శాతం, రిఫైన్డ్ పామ్‌ఆయిల్ 9 శాతం చొప్పున తగ్గాయి. అధిక మార్జిన్లు ఇచ్చే ఉత్పత్తులపై దృష్టిపెట్టడం, సొంత తయారీ కారణంగా నిర్వహణ పనితీరు మెరుగుపడడం, నెట్‌వర్క్ పటిష్టం చేసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు తగ్గడం, కొత్త కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనుండడం, వ్యయ నియంత్రణ పద్ధతులను పాటించడం, పటిష్టమైన బ్రాండ్ నేమ్.. ఇవన్నీ కంపెనీకి సానుకూలాంశాలు.
 
ఇండియన్ ఆయిల్ కార్ప్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ:
మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.405 టార్గెట్ ధర: రూ.570
ఎందుకంటే: ఇంధన రంగంలో గత రెండేళ్లుగా వస్తున్న సంస్కరణల(పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ తొలగించడం, ఎల్పీజీ సిలిండర్ రాయితీలను నేరుగా వినియోగదారులకు అందించడం వంటి) కారణంగా కంపెనీ నష్టాలు 80 శాతం వరకూ తగ్గాయి. రుణ భారం కూడా బాగా తగ్గింది. దీంతో బ్యాలెన్స్‌డ్ షీట్ పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బాగా తగ్గుతుండటంతో రుణ భారం, వడ్డీ భారం మరింత తగ్గనున్నాయి.

పెట్రో ఇంధనాలపై ధరల నియంత్రణ తొలగడంతో మార్కెటింగ్ మార్జిన్లు పెరుగుతాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీకే ఆదాయ మార్గాలు అధికంగా ఉన్నాయి.  కంపెనీ మొత్తం ఆదాయంలో రిఫైనింగ్ వాటా 40%, మార్కెటింగ్ వాటా 30%, పైప్‌లైన్ వాటా 24%, పెట్రోకెమికల్స్ విభాగం 6%గా ఉన్నాయి. భారత్‌లో మొత్తం 22 రిఫైనరీలు ఉండగా, ఈ కంపెనీవే 11 ఉన్నాయి. త్వరలో పారదీప్ రిఫైనరీ ప్రారంభం కానుంది. దీని పూర్తి ప్రయోజనాలు 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుతాయి. 11,000 కిమీతో అతిపెద్ద  పైప్‌లైన్ నెట్‌వర్క్ కంపెనీ సొంతం. కొత్త పైప్‌లైన్లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. విభిన్నమైన రంగాల నుంచి వస్తున్న రాబడుల కారణంగా కంపెనీ ఆదాయానికి స్థిరత్వం లభిస్తుందని భావిస్తున్నాం. మార్కెటింగ్ మార్జిన్లు బాగా పెరుగుతాయనే అంచనాలతో ఈ కంపెనీ షేర్ రీ రేటింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
 
జైడస్ వెల్‌నెస్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ:
ఫస్ట్‌కాల్ రీసెర్చ్  ప్రస్తుత ధర: రూ.888 టార్గెట్ ధర: రూ.990ఎందుకంటే: 1988 నుంచి ఫిట్‌నెస్, ఆరోగ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు అందజేస్తోంది. అంతకంతకూ వృద్ధి చెందుతున్న ఈ సెగ్మెంట్లలో  షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్, నూట్రాలైట్, యాక్టిలైఫ్  వంటి హెల్త్‌కేర్ బ్రాండ్లతో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా సాధించింది. షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్ స్క్రబ్, ఎవర్‌యూత్ పీల్ ఆఫ్, నూట్రాలైట్... ఈ కంపెనీ బ్రాండ్లన్నీ ఆయా సెగ్మెంట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. పంచదార ప్రత్యామ్నాయ మార్కెట్లో షుగర్ ఫ్రీ బ్రాండ్‌దే 93 శాతం మార్కెట్ వాటా. 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం యాక్టిలైఫ్ పేరుతో పోషకాలతో కూడిన పాల ఉత్పత్తిని 2011లో మార్కెట్లోకి తెచ్చింది.

ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బావున్నాయి. గత క్యూ1లో రూ.17 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.19.5 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.42 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగాయి. ఇబిటా రూ.18 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.21 కోట్లకు ఎగసింది. స్థూల లాభం 17 శాతం, ఇతర ఆదాయం 81 శాతం చొప్పున పెరిగాయి. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగవచ్చు. రెండేళ్లలో నిర్వహణ లాభం 7 శాతం చొప్పున, నికర లాభం కూడా 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా.
 
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement