Britannia Industries
-
ఆహార పరిశ్రమపై కమోడిటీ ధరల ప్రభావం
కోల్‌కతా: అధిక కమోడిటీ ధరలు, అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆహార పరిశ్రమ (ఫుడ్)పై గణనీయంగా పడినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. దీర్ఘకాలంలో ఈ అంశాల ప్రభావం అధికంగా ఉంటుందని 2022–23 వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి సాయపడినట్టు వివరించింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆహార పరిశ్రమ ఎదుర్కొన్న పెద్ద సవాలు.. ముడి పదార్థాలైన గోధుమలు, పాలు, పంచదార, పామాయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోవడం వల్ల ఎదురైన ద్రవ్యోల్బణమే’’అని పేర్కొంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రధానంగా బిస్కట్లు, కేక్‌లు, రస్్క, బ్రెడ్, చాక్లెట్ల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ పరిస్థితులు ఎంతో ఆశావహంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులు అన్నవి 2023–24లో ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. సరైన వర్షపాతంపైనే గ్రామీణాభివృద్ధి, ఆహార ధరలు ఆధారపడి ఉంటాయి’’అని బ్రిటానియా తన నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించామని, కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి విస్తరించామని ప్రకటించింది. బ్రాండ్ బలోపేతం, కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, సార్క్ దేశాలపై దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. -
బ్రిటానియా గూటికి కెనాఫ్రిక్
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ నుంచి వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను హెచ్‌యూఎల్, యూనిలీవర్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచేందుకు సిద్దమయ్యాయి. ఇప్పుడు ధరల పెరుగుదల జాబితాలోకి బిస్కట్లు కూడా వచ్చి చేశాయి. రానున్న రోజుల్లో బిస్కెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుకు బ్రిటానియా సిద్ధం..! భారత అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్..బిస్కెట్ల ధరలను 7 శాతం మేర పెంచాలని ప్రణాళికలను రచిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా...ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని వరుణ్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావంతో గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రకటించినప్పటీనుంచి...కార్మికుల కొరత, సప్లై చైన్ వంటి పరిమితులతో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు భారంగా మారింది. ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమైందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. కాగా బ్రిటానియాతో పాటుగా...ఇతర బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ధరలను పెంచే బదులుగా క్వాంటిటీ తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తోన్నారు. చదవండి: ఆల్‌టైం రికార్డు ధరకు సన్‌ఫ్లవర్ ఆయిల్..! -
బ్రిటానియా సంచలన నిర్ణయం.. 50 శాతం బాధ్యతలు వారికే !
కోల్‌కతా: ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. 2024 నాటికి సంస్థలో వీరి వాటాను 50 శాతానికి చేర్చనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ వెల్లడించారు. గువాహటి ఫ్యాక్టరీలో వీరి సంఖ్య 60 శాతం ఉందని, దీనిని 65కు చేర్చనున్నట్టు తెలిపారు. మహిళా సాధికారత కోసం కంపెనీ ఇప్పటికే స్టార్టప్ చాలెంజ్‌ను ప్రారంభించిందన్నారు. ఈ–కామర్స్, డిజిటల్ సర్వీసెస్, మొబైల్ వ్యాన్స్ ద్వారా కంటి సంబంధ చికిత్స సేవలు, పిల్లల విద్య తదితర విభాగాల్లో స్టార్టప్స్ కోసం 30 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నిధులు సమకూర్చామని వెల్లడించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం గూగుల్‌తో చేతులు కలిపామన్నారు. -
బ్రిటానియా- కేఐవోసీఎల్ పతనం
విదేశీ ప్రతికూలతల కారణంగా ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 240 పాయింట్లు జంప్‌చేసి 40,671ను తాకింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 11,932 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను చేరకపోవడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నిర్ణయాలు నిరాశపరచడంతో మెటల్, మైనింగ్ రంగ పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వెరసి ఈ రెండు షేర్లూ లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 3,419 కోట్లను తాకింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చూపనప్పటికీ వ్యయాల నియంత్రణ, తగ్గిన ముడి సరుకుల ధరలు కంపెనీ లాభదాయకత మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్రిటానియా షేరు 5 శాతం పతనమై రూ. 3,583 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3,575 వరకూ వెనకడుగు వేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 110 ధర మించకుండా 1.41 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 156 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఐవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 123 దిగువన ఫ్రీజయ్యింది. -
బ్రిటానియాకు ‘బిస్కెట్ల’ దన్ను
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రెట్టింపునకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.249 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.543 కోట్లకు పెరిగింది. లాక్డౌన్ సమయంలో బిస్కెట్లకు డిమాండ్ పెరగడం, వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు చేరడం కూడా ఈ కంపెనీ అమ్మకాలకు కలసివచ్చిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.2,768 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,514 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. అన్ని అంశాల్లోనూ ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ► నిర్వహణ లాభం రూ.395 కోట్ల నుంచి రూ.717 కోట్లకు ఎగసింది. ► నిర్వహణ లాభ మార్జిన్ 6.4 శాతం పెరిగి 21 శాతానికి చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.3,784 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,949ను తాకింది. -
డన్జోతో బ్రిటానియా జట్టు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలవుతున్న వేళ ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచేందుకు పలు ఎఫ్ఎంసీజీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఆన్–డిమాండ్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం డన్జోతో చేతులు కలిపినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద డన్జో యాప్ ద్వారా వినియోగదారులు బ్రిటానియా ఉత్పత్తులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. ఆర్డరు చేసిన గంటలోనే ఉత్పత్తులను అందించేలా చర్యలు తీసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందుకోసం బ్రిటానియా ఎసెన్షియల్స్ పేరిట బెంగళూరులో మంగళవారం తొలి స్టోర్ ప్రారంభించినట్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ వరుణ్ బెర్రీ వివరించారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణే, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, చెన్నైలో కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. బిస్కట్లు, కేకులు, రస్కులు, మిల్క్‌షేక్‌లు, నెయ్యి, పాల పౌడరు, వేఫర్లు వంటి ఉత్పత్తులను బ్రిటానియా విక్రయిస్తోంది. -
బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభం రూ.403 కోట్లు
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.403 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.303 కోట్లుతో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,855 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్డీ వరుణ్ బెర్రి పేర్కొన్నారు. మార్కెట్ కంటే వేగంగా వృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తున్నామని వరుణ్ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 13 శాతం పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.2,455 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ2లో 6 శాతం వృద్ధితో రూ.2,618 కోట్లకు పెరిగాయని తెలిపారు. ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడంతో వ్యయాలు పెద్దగా పెరగలేదని వివరించారు. అందుకే ఈ క్యూ2లో అత్యధిక నిర్వహణ లాభం సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 1.4 శాతం నష్టంతో రూ.3,116 వద్ద ముగిసింది. -
10 వేల మందిని తొలగించక తప్పదు!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. భారీగా పతనమైన డిమాండ్, జీఎస్టీ భారంతో 8నుంచి 10వేల మంది ఉద్యోగులను తీసివేయాలని చూస్తున్నామని బ్రిటానియా వెల్లడించింది. పార్లే ఉత్పత్తుల కేటగిరీ హెడ్ మయాంక్ షా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిస్కట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న18శాతం జీఎస్టీ తలకుమించిన భారంగా ఉందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జీఎస్టీ కౌన్సిల్ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కిలోకు రూ .100 లేదా అంతకంటే తక్కువ ధర గల బిస్కట్ ప్యాకెట్లపై జీఎస్టీ తగ్గించాలని మయాంక్ షా డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఉద్యోగాల కోత తప్ప తమకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అటు భారీగా పడిపోయిన డిమాండ్, అధిక జీఎస్టీ రేటు మొత్తం బిస్కట్ల పరిశ్రమను దెబ్బతీస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిస్కట్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరుతోంది. జూన్ 30, 2019 తో ముగిసిన త్రైమాసికంలో, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏకీకృత నికర అమ్మకాలలో సంవత్సరానికి 5.9 శాతం (వార్షిక ప్రాతిపదికన)వృద్ధిని 2,677.3 కోట్ల రూపాయలుగా నమోదు చేయగా, నికర లాభం 3.7 శాతం తగ్గి 248.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రిటానియా గ్రామీణ వ్యాపారం, పట్టణాల కంటే వేగంగా పెరిగేది. కానీ ఈ త్రైమాసికంలో క్షీణించింది. ఈ త్రైమాసికంలో కేవలం 3 శాతం వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా బ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ వినియోగదారుడు కేవలం రూ. 5 బిస్కట్ ప్యాకెట్ కొనడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారనీ, ఇది తమ లాభాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తోందన్నారు. సహజంగానే, ఆర్థిక వ్యవస్థలో కొన్ని తీవ్రమైన సమస్య ఉందని మిస్టర్ బెర్రీ వ్యాఖ్యానించారు. మాట్లాడుతూజూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన రోజు ఆగస్టు 9 నుండి కంపెనీ షేర్లు దాదాపు 7.5 శాతం (మంగళవారం ముగిసే నాటికి) పతనమైంది. బుధవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. కాగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ సహా, పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 5.4 - 5.6 శాతం మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, దేశీయంగా ఆటో మొబైల్ రంగంలో తీవ్ర సంక్షోభానికి తోడు ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ లాంటి కీలక రంగాల్లో మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభం రూ.294 కోట్లు
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.263 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.294 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,582 కోట్ల నుంచి రూ.2,861 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, వరుణ్ బెర్రి చెప్పారు. తమ ప్రధాన వ్యాపారం జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం, వ్యయ నియంత్రణ పద్ధతులు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. పూర్తి ఆహార కంపెనీగా అవతరించడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్య సాధన కోసం కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందిస్తున్నామని వివరించారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్(1500%)ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,004 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.1,155 కోట్లకు పెరిగిందని వరుణ్ వెల్లడించారు. ఆదాయం రూ.10,156 కోట్ల నుంచి రూ.11,261 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. -
విజేతలకు ప్రపంచకప్ నేరుగా చూసే అవకాశం
బెంగళూరు: త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఐసీసీతో జతకట్టిన బ్రిటానియా యాజమాన్యం ‘బ్రిటానియా ఖావో... వరల్డ్ కప్ జావో’ స్లోగన్‌తో క్రికెట్ అభిమానులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగా అదృష్టవంతులైన 100 మంది అభిమానులకు ఇంగ్లండ్‌లో జరుగనున్న ప్రపంచ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చుల్ని బ్రిటానియా కంపెనీ భరించనుంది. 1999లోనూ ఇదే ఫార్ములాతో బ్రిటానియా ప్రజలకు చేరువైంది. కంపెనీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మళ్లీ ఈ ఏడాది అదే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. దీని ప్రచార కార్యక్రమం మంగళవారం బెంగళూరులో జరిగింది. 1989 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణి, శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని పొందాలనుకునే వారు బ్రిటానియా ప్యాకెట్‌పై ఉన్న ప్రోమో కోడ్‌ను అందులో సూచించిన నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో ఎంపికైన 100 మంది క్రికెట్ అభిమానులు నేరుగా మ్యాచ్ చూసే అవకాశాన్ని పొందుతారు. -
బ్రిటానియా కొత్త లోగో : కొత్త ఉత్పత్తులు
సాక్షి, కోలకతా: బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంద వసంతాలను పూర్తి చేసుకుని ఉత్సాహంగా ఉరకలు వేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. ముఖ్యంగా శతాబ్ది వేడుకల సందర్భంగా కొత్త లోగోను విడుదల చేసింది. 2018 వార్షిక నివేదిక సందర్భంగా ఛైర్మన్ నుస్లీ వాడియా సరికొత్త లోగోను ఆవిష్కరించారు. పాత లోగోతో పోలిస్తే కొత్తది భిన్నంగా ఉందనీ, తమ విస్తరణ ప్లాన్లకు అనుగుణంగానే లోగో కూడా మోడరన్ లుక్‌లో ఉన్నట్టు చెప్పారు. కోలకతాలో జరిగిన 99వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ నుస్లీ వాడియా షేర్ హోల్డర్లను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. బ్రిటానియా వ్యాపారపరంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వచ్చే ఆరు నెలల్లో సంస్థను విస్తరించే దిశలో భాగంగా కొత్త ఉత్పత్తులు తీసుకురానున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లలో ఖర్చులు తగ్గించుకోవటం వల్ల రూ.800 కోట్లు ఆదా చేయగలిగినట్లు చెప్పారు. అలాగే షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.60 విలువ కలిగిన బోనస్ డిబెంచర్‌ను ఇవ్వాలని నిర్ణయించిందని ప్రకటించారు. ఇందుకోసం ఆగస్టు 23న బోర్డు సమావేశం కానుంది. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 50కంటే ఎక్కువ ఉత్పత్తులను కొత్తగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మార్కెట్లో 33శాతం వాటాతో పార్లేను బ్రిటానియా అధిగమించిందని వాటాదారుల ప్రశ్నలకు సమాధానంగా బెర్రీ వివరించారు. కానీ అమ్మకాలు, వాల్యూమ్ పరంగా, పార్లే మార్కెట్‌ను లీడ్ చేస్తోందనీ, దీన్ని అధిగమిచేందుకు బ్రిటానియాకు రెండు,మూడు సంవత్సరాలు పడుతుందన్నారు. అలాగే జీఎస్టీ కష్టాలున్నప్పటికీ సంస్థ అనుకున్న లక్ష్యాలని సాధించగలిగిందని తెలిపారు. ప్రతిరోజూ 50మిలియన్ ప్యాక్‌ల విక్రయ లక్ష్యాన్ని అధిగమించింది. రూ .15 బిలియన్ల స్థూల లాభాన్నీ, 10 బిలియన్ల నికర లాభం సాధించినట్టు బెర్రీ వెల్లడించారు. బిస్కెట్లు, రొట్టెలు, కేకులు, పాల ఉత్పత్తులకు పరిమితం కాకుండా, పూర్తి ఫుడ్ కంపెనీగా మారుతుందన్నారు. -
బ్రిటానియాకు పతంజలి దెబ్బ
ముంబై : అతిపెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ స్వల్ప లాభాలాను నమోదు చేసినప్పటికీ, మార్కెట్లో ఈ కంపెనీ షేరు కుదేలయ్యింది. ముఖ్యంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న పోటీ తమ వ్యాపారం పై ప్రభావం చూపిందని కంపెనీ చెబుతోంది. అటు విశ్లేషకుల అంచనాలకుగుణంగా సంస్థ లాభాలు పెరగడకపోవడంతో మార్కెట్లో బ్రిటానియా 8 శాతం మేర నష్టపోయింది. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు తక్కువగా ఆదాయాన్ని నమోదుచేయడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. బెంగళూరుకు చెందిన బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభాలు 14శాతం పెరిగి రూ.190 కోట్లగా చూపించాయి. 8శాతం మేరే అమ్మకాలు పెరిగి రూ.2,190 కోట్లగా నమోదయ్యాయి. 46శాతం పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు, 14శాతం కంపెనీకి వచ్చే ఇతరత్రా ఆదాయాలు పడిపోయాయి. దీంతో బ్రిటానియా నికర లాభాలు కొంతమేర చేజారి, మార్కెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందులు కావడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్సైజ్ డ్యూటీ ప్రోత్సహకాలను దశల వారీగా ప్రభుత్వం తొలగించడంతో, ఈ త్రైమాసికంలో రాబడులపై 100 పాయింట్ల ప్రభావం చూపాయని బ్రిటానియా తెలిపింది. అదేవిధంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పోటీ, కంపెనీ మార్కెట్ షేరుపై ప్రభావం చూపిందని క్రిస్ట్ వెల్త్ మేనేజ్ మెంట్ సీఈవో లాన్సేలట్ డి కన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం బ్రిటానియా లాభాలపై ప్రభావం చూపాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటానియా లాభాలు మార్కెట్ అంచనాలను తాకలేకపోవడంతో, మార్కెట్లో ఈ షేర్లు 8శాతం మేర నష్టపోయాయి. -
స్టాక్స్ వ్యూ
భారతీ ఇన్ఫ్రాటెల్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.396 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: వెర్లైస్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన టెలికాం టవర్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర టెలికాం మౌలిక సదుపాయాలను అందజేస్తోంది. ఈ తరహా సేవలను అందిస్తున్న అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. వివిధ మొబైల్ ఆపరేటర్లకు(ఆదాయం పరంగా టాప్ త్రీ పొజిషన్లలో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్లకు) కమ్యూనికేషన్ స్ట్రక్చర్స్‌ను, టెలికాం టవర్లమౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. కంపెనీ 87వేలకు పైగా టెలికాం టవర్లను నిర్వహిస్తోంది. వీటిల్లో ఈ కంపెనీ సొంతానివి 37వేలకు పైగా ఉండగా, మిగతావి ఈ కంపెనీకి 42 శాతం వాటా ఉన్న ఇంటస్ టవర్స్ కంపెనీవి. తన కార్యకలాపాల్లో అధిక భాగం పర్యావరణ అనుకూల విధానాలనే పాటిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ2లో రూ. 2,930 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 4 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.1,328 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,516 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ.465 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.579 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,773 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.6,053 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇదే జోరును రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగించవచ్చు. ప్రస్తుత ధరకు, పుస్తక ధరకు మధ్య ఉన్న నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.83కు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.43కు తగ్గుతుందని అంచనా. రెండేళ్లలో నికర అమ్మకాలు 7 శాతం, నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.450 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్రిటానియా ఇండస్ట్రీస్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,936 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4 శాతం పెరిగి 15 శాతానికి చేరింది. ఇదే జోరు ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్లలో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ఈ ఆర్నెళ్లలో అమ్మకాలు 8-10 శాతం వృద్ధి చెందుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండడం, వివిధ వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు 14 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ఈ కంపెనీకి భారీగా ప్రయోజనం కలుగనున్నది. గత ఒక నెల కాలంలో ఈ షేర్ ధర 11 శాతం వరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలో ఈ షేర్ కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. మంచి వృద్ధి అవకాశాలున్న ఈ షేర్‌ను రూ.3,650 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం. టైగర్ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. రస్క్, కేకుల వంటి స్నాక్‌ల మార్కెట్లోకి మరింతగా విస్తరించనున్నది. 75 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కంపెనీకి వస్తోన్న అంతర్జాతీయ ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగానే ఉంది. కొత్త ఉత్పత్తులతో, నెట్వర్క్ ఇస్తరణతో దీనిని నాలుగేళ్లలో 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిస్కెట్ల కంటే మార్జిన్లు అధికంగా ఉండే కేక్‌లు, రస్క్‌ల అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది. వినూత్నమైన, విభిన్నమైన రుచులు గల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి రూ.65 కోట్లతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,858 కోట్లుగా ఉన్న కంపెనీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,836 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,312 కోట్లకు పెరుగుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,974 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: భారత బిస్కట్ మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. గుడ్ డే, మారీ, టైగర్, క్రీమ్ ట్రీట్, 50-50, మిల్క్ బికీస్, న్యూట్రి చాయిస్ బ్రాండ్లతో విక్రయాలు సాగిస్తోంది. అమ్మకాలు, నిర్వహణ పనితీరు బాగా ఉండడం వంటి కారణాల వల్ల వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రకరకాలైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడం వంటి కారణాల వల్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధిస్తున్నాయి. రస్క్‌లు, కేక్‌ల కేటగిరిలోకి ప్రవేశించిన ఈ కంపెనీ డైరీ, ఇతర స్నాక్స్ కేటగిరిల్లోకి కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. బ్రేక్ ఫాస్ట్ సంబంధిత ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. 2012-15 కాలానికి రాబడులు 50 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-15 కాలానికి ఆదాయం 13 శాతం చొప్పున, నికర లాభం 45 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. కీలక ముడి పదార్ధాల ధరలు గోధుమ పిండి 8 శాతం, పంచదార 10 శాతం, రిఫైన్డ్ పామ్ఆయిల్ 9 శాతం చొప్పున తగ్గాయి. అధిక మార్జిన్లు ఇచ్చే ఉత్పత్తులపై దృష్టిపెట్టడం, సొంత తయారీ కారణంగా నిర్వహణ పనితీరు మెరుగుపడడం, నెట్వర్క్ పటిష్టం చేసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు తగ్గడం, కొత్త కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనుండడం, వ్యయ నియంత్రణ పద్ధతులను పాటించడం, పటిష్టమైన బ్రాండ్ నేమ్.. ఇవన్నీ కంపెనీకి సానుకూలాంశాలు. ఇండియన్ ఆయిల్ కార్ప్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.405 టార్గెట్ ధర: రూ.570 ఎందుకంటే: ఇంధన రంగంలో గత రెండేళ్లుగా వస్తున్న సంస్కరణల(పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ తొలగించడం, ఎల్పీజీ సిలిండర్ రాయితీలను నేరుగా వినియోగదారులకు అందించడం వంటి) కారణంగా కంపెనీ నష్టాలు 80 శాతం వరకూ తగ్గాయి. రుణ భారం కూడా బాగా తగ్గింది. దీంతో బ్యాలెన్స్డ్ షీట్ పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బాగా తగ్గుతుండటంతో రుణ భారం, వడ్డీ భారం మరింత తగ్గనున్నాయి. పెట్రో ఇంధనాలపై ధరల నియంత్రణ తొలగడంతో మార్కెటింగ్ మార్జిన్లు పెరుగుతాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీకే ఆదాయ మార్గాలు అధికంగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో రిఫైనింగ్ వాటా 40%, మార్కెటింగ్ వాటా 30%, పైప్‌లైన్ వాటా 24%, పెట్రోకెమికల్స్ విభాగం 6%గా ఉన్నాయి. భారత్‌లో మొత్తం 22 రిఫైనరీలు ఉండగా, ఈ కంపెనీవే 11 ఉన్నాయి. త్వరలో పారదీప్ రిఫైనరీ ప్రారంభం కానుంది. దీని పూర్తి ప్రయోజనాలు 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుతాయి. 11,000 కిమీతో అతిపెద్ద పైప్‌లైన్ నెట్వర్క్ కంపెనీ సొంతం. కొత్త పైప్లైన్లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. విభిన్నమైన రంగాల నుంచి వస్తున్న రాబడుల కారణంగా కంపెనీ ఆదాయానికి స్థిరత్వం లభిస్తుందని భావిస్తున్నాం. మార్కెటింగ్ మార్జిన్లు బాగా పెరుగుతాయనే అంచనాలతో ఈ కంపెనీ షేర్ రీ రేటింగ్ అయ్యే అవకాశాలున్నాయి. జైడస్ వెల్నెస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.888 టార్గెట్ ధర: రూ.990ఎందుకంటే: 1988 నుంచి ఫిట్నెస్, ఆరోగ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు అందజేస్తోంది. అంతకంతకూ వృద్ధి చెందుతున్న ఈ సెగ్మెంట్లలో షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్, నూట్రాలైట్, యాక్టిలైఫ్ వంటి హెల్త్‌కేర్ బ్రాండ్లతో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా సాధించింది. షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్ స్క్రబ్, ఎవర్‌యూత్ పీల్ ఆఫ్, నూట్రాలైట్... ఈ కంపెనీ బ్రాండ్లన్నీ ఆయా సెగ్మెంట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. పంచదార ప్రత్యామ్నాయ మార్కెట్లో షుగర్ ఫ్రీ బ్రాండ్‌దే 93 శాతం మార్కెట్ వాటా. 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం యాక్టిలైఫ్ పేరుతో పోషకాలతో కూడిన పాల ఉత్పత్తిని 2011లో మార్కెట్లోకి తెచ్చింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బావున్నాయి. గత క్యూ1లో రూ.17 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.19.5 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.42 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగాయి. ఇబిటా రూ.18 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.21 కోట్లకు ఎగసింది. స్థూల లాభం 17 శాతం, ఇతర ఆదాయం 81 శాతం చొప్పున పెరిగాయి. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగవచ్చు. రెండేళ్లలో నిర్వహణ లాభం 7 శాతం చొప్పున, నికర లాభం కూడా 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.