సంస్థ చైర్మన్ నుస్లీ వాడియా, ఎండీ వరుణ్ బెర్రీ
సాక్షి, కోలకతా: బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంద వసంతాలను పూర్తి చేసుకుని ఉత్సాహంగా ఉరకలు వేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. ముఖ్యంగా శతాబ్ది వేడుకల సందర్భంగా కొత్త లోగోను విడుదల చేసింది. 2018 వార్షిక నివేదిక సందర్భంగా ఛైర్మన్ నుస్లీ వాడియా సరికొత్త లోగోను ఆవిష్కరించారు. పాత లోగోతో పోలిస్తే కొత్తది భిన్నంగా ఉందనీ, తమ విస్తరణ ప్లాన్లకు అనుగుణంగానే లోగో కూడా మోడరన్ లుక్‌లో ఉన్నట్టు చెప్పారు.
కోలకతాలో జరిగిన 99వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ నుస్లీ వాడియా షేర్ హోల్డర్లను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. బ్రిటానియా వ్యాపారపరంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వచ్చే ఆరు నెలల్లో సంస్థను విస్తరించే దిశలో భాగంగా కొత్త ఉత్పత్తులు తీసుకురానున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లలో ఖర్చులు తగ్గించుకోవటం వల్ల రూ.800 కోట్లు ఆదా చేయగలిగినట్లు చెప్పారు. అలాగే షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.60 విలువ కలిగిన బోనస్ డిబెంచర్‌ను ఇవ్వాలని నిర్ణయించిందని ప్రకటించారు. ఇందుకోసం ఆగస్టు 23న బోర్డు సమావేశం కానుంది.
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 50కంటే ఎక్కువ ఉత్పత్తులను కొత్తగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మార్కెట్‌లో 33శాతం వాటాతో పార్లేను బ్రిటానియా అధిగమించిందని వాటాదారుల ప్రశ్నలకు సమాధానంగా బెర్రీ వివరించారు. కానీ అమ్మకాలు, వాల్యూమ్ పరంగా, పార్లే మార్కెట్‌ను లీడ్ చేస్తోందనీ, దీన్ని అధిగమిచేందుకు బ్రిటానియాకు రెండు,మూడు సంవత్సరాలు పడుతుందన్నారు. అలాగే జీఎస్‌టీ కష్టాలున్నప్పటికీ సంస్థ అనుకున్న లక్ష్యాలని సాధించగలిగిందని తెలిపారు. ప్రతిరోజూ 50మిలియన్ ప్యాక్ల విక్రయ లక్ష్యాన్ని అధిగమించింది. రూ .15 బిలియన్ల స్థూల లాభాన్నీ, 10 బిలియన్ల నికర లాభం సాధించినట్టు బెర్రీ వెల్లడించారు. బిస్కెట్లు, రొట్టెలు, కేకులు, పాల ఉత్పత్తులకు పరిమితం కాకుండా, పూర్తి ఫుడ్ కంపెనీగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment