
మహీంద్రా అండ్ మహీంద్రా - కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ. 897
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
టార్గెట్ ధర: రూ.10,53
ఎందుకంటే: ప్రస్తుతం 43 శాతంగా ఉన్న దేశీయ ట్రాక్టర్ల మార్కెట్ వాటాను 50 శాతానికి పెంచుకోవడానికి మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయత్నాలు చేస్తోంది. ట్రక్‌స్టార్‌బ్రాండ్‌తో తక్కువ ధరల్లో ట్రాక్టర్లను అందించడం దాంట్లో ఒక ప్రయత్నం. వరుసగా రెండో ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాల కారణంగా ట్రాక్టర్ల అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం. కూలీల కొరత తీవ్రమవుతుండటం, సాంకేతిక పరిజ్జానం మరింతగా అందుబాటులోకి రావడం, తదితర కారణాల వల్ల భారత్‌లో వ్యవసాయం తీరు మారుతోంది. దీంతో ట్రాక్టర్ల, సాగు యంత్రాల మార్కెట్ మరింతగా వృద్ధి చెందగలదని కంపెనీ భావిస్తోంది.
అందుకే ట్రాక్టర్లు కాకుండా ఇతర సాగు యంత్రాల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. సాగు యంత్ర పరికరాల విభాగం(ఎఫ్‌ఈఎస్) ఆదాయం ఆరేళ్లలో కనీసం 12% చక్రగతి వృద్ధితో రెట్టింపవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ సాగు యంత్ర సంబంధిత మార్కెట్‌లో మహీంద్రా ఎఫ్‌ఈఎస్ విభాగం వాటా 2 శాతం మాత్రమే ఉంది. దీంతో అంతర్జాతీయంగా తమకు అపార అవకాశాలుంటాయని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ వ్యవసాయ యంత్ర పరిశ్రమలో మరింత వాటా పొందడానికి గట్టిగానే కృష్టి చేస్తోంది. అంతర్జాతీయంగా 98% భూ కమతాలు 50 హెక్టార్లపైనే ఉంటాయి. దీనికి తగ్గట్లుగా యంత్రాలను అందిం చాలని కంపెనీ యోచిస్తోంది.
ఇప్ప టివరకూ భారత ట్రాక్టర్ల కంపెనీగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సాగు యంత్ర పరికరాల విభాగం(ఎఫ్‌ఈఎస్) అంతర్జాతీయ సాగు యంత్ర సరఫరాదారుగా రూపాంతరం చెందుతోంది. ఇక కంపెనీ నిర్వహణలోని అన్ని వ్యాపారాల్లో పటిష్టమైన రికవరీ/వృద్ధిని సాధిస్తోంది. వాహన పరిశ్రమకు సంబంధించి గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశమే. కంపెనీ అందించనున్న కొత్త మోడళ్లు విజయం సాధించడం, యుటిలిటీ వెహికల్స్, ట్రాక్టర్లు, పిక్–అప్ వాహనాల విక్రయాల జోరు... సానుకూలాంశాలు.
ఫెడరల్ బ్యాంక్ - కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ. 81
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
టార్గెట్ ధర: రూ.130
ఎందుకంటే: కేరళ కేంద్రంగా ఈ ప్రైవేట్ బ్యాంక్ 25కు పైగా రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐడీబీఐ భాగస్వామ్యంతో బీమా, ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారాలను నిర్వహిస్తోంది. 1,252 బ్రాంచ్‌లతో, 1,696 ఏటీఎమ్‌లతో బ్యాంకింగ్ సేవలందిస్తోంది. బ్యాంక్ ఆస్తులు 1.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి మించి రుణ వృద్ది సాధిస్తామని ఈ బ్యాంక్ ధీమాగా ఉంది. ఫీజు ఆదాయం పెంచుకోవడంపై యాజమాన్యం దృష్టి పెట్టింది. అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో వాటాల కొనుగోలుకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల కొనుగోళ్ల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది.
మొండి బకాయిల సమస్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంత తీవ్రంగా ఉండకపోవచ్చని, రుణ నాణ్యత మెరుగుపడగలదని బ్యాంక్ భావిస్తోంది. అయితే ఎస్‌ఎమ్‌ఈ, రిటైల్ విభాగాలు మెరుగుపడుతున్నా, కార్పొరేట్ రుణ విభాగంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. తీవ్రమైన మొండి బకాయిల సమస్య కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి పోటీ తీవ్రత తగ్గడం, వడ్డీరేట్ల పెంపు కారణంగా నికర వడ్డీ ఆదాయం మెరుగుపడే అవకాశాలు, నిర్వహణ వ్యయాల నియంత్రణ, ఆదాయ జోరు మెరుగుపడటంతో ఉత్పాదకత పెరగడం వల్ల రాబడి నిష్పత్తులు మెరుగుపడటం, పెట్టుబడులు పుష్కలంగా ఉండటం, డిజిటల్ బ్యాంకింగ్ ఫలాలు మధ్య కాలానికి అందనుండటం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 65 శాతంగా ఉండటం .. ఇవన్నీ సానుకూలాంశాలు.
కాసా నిష్పత్తి తక్కువగా ఉండటం, అధిక భాగం డిపాజిట్లు ప్రవాస భారతీయులవి కావడం.. ప్రతికూలాంశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా 1 శాతం రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ), 13 శాతం రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) సాధించాలన్న లక్ష్యాలను ఈ బ్యాంక్ చేరుకోగలదని భావిస్తున్నాం. గత ఆరు నెలల్లో ఈ బ్యాంక్ షేర్ పతనమై ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment