రతన్ టాటాపై సిట్ దర్యాప్తు చేయించండి
ప్రధానికి సుబ్రమణ్యం స్వామి లేఖ
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన ఆరోపణలకు సంబంధించి పారిశ్రామికవేత్త రతన్‌టాటాపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) విచారణకు ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి స్వామి ఒక లేఖ రాశారు. టాటాపై నాలుగు నేరపూరిత ఆరోపణలు ఉన్నాయని ఆరోపించిన స్వామి, ‘‘ ఆయనను రక్షించడానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి జోక్యం లేని తగిన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, సెబీ అధికారులతో కూడిన సిట్ బృందం దీనిని విచారించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
కుట్ర, నేరపూరిత విశ్వాస విఘాతం, నిధుల అక్రమ వినియోగం, ధనార్జన, కంపెనీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆయనపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఎయిరేషియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విషయంలో నిబంధనల ఉల్లంఘనలు భారీగా జరిగాయని విమర్శించిన ఆయన, ఈ అంశంలో రతన్ టాటా పాత్రపై ఇంతక్రితమే ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజా లేఖలో ఈ విషయాన్ని కూడా స్వామి ప్రస్తావించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన వెంటనే సామి ఒక ట్వీట్ చేస్తూ... ‘రతన్ టాటా నిజమైన టాటా వంశస్తుడు కాదు. దత్తత పరంపరకు చెందినవాడు’’ అని పేర్కొన్నారు.