రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్‌! | Sundar Pichai Calls for Entry-Level Smartphones as Cheap as Rs. 2000 | Sakshi
Sakshi News home page

రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్‌!

Published Fri, Jan 6 2017 12:28 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో మాటామంతీ - Sakshi

ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో మాటామంతీ

డిజిటల్‌ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది...
డిజిటల్‌ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌
గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌


ఖరగ్‌పూర్‌: డిజిటల్‌ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్‌ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్‌ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్‌ పేర్కొన్నారు. గూగుల్‌ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్‌ మొబైల్‌ తయారీ సంస్థలతో టైఅప్‌ అయి ‘ఆండ్రాయిడ్‌ వన్‌’ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్‌ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్‌ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది.

                                గోకుల్‌పూర్‌లో సుందర్‌ పిచాయ్‌కు టోపీతో స్వాగతం పలుకుతున్న మహిళలు
చైనాను భారత్‌ ఎప్పుడు దాటేస్తుంది?
డిజిటల్‌ రంగంలో భారత్‌ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందన్న ప్రశ్నకు పిచాయ్‌ స్పందిస్తూ... ‘‘డిజిటల్‌ ఆర్థిక రంగంలో భారత్‌ ప్రపంచ స్థాయి దేశంగా ఎదుగుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఏ దేశంతోనైనా పోటీ పడగలదు. అందుకు తగ్గ నిర్మాణం ఉంది’’ అని పిచాయ్‌ బదులిచ్చారు. ఇక్కడి స్టార్టప్‌లు  స్వదేశం కోసం, ప్రపంచం కోసం రూపొందిస్తున్న ఉత్పత్తులే దీన్ని సాధ్యం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డిజిటల్‌ ఇండియా కోసం మరిన్ని కార్యక్రమాలను గూగుల్‌ తీసుకువస్తుందన్నారు. రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులకు రైల్‌టెల్‌తో భాగస్వామ్యం, డిజిటల్‌ పేమెంట్ల కోసం ఎన్‌పీసీఐతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు.  దేశీయంగా ఇంగ్లిష్‌ మాట్లాడే ప్రజల శాతం తక్కువేనని, ఈ దృష్ట్యా మరింత మందిని చేరుకునేందుకు వీలుగా గూగుల్‌ తన సేవలను సాధ్యమైనన్ని ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) చక్కగా పనిచేస్తోందని, డిజిటల్‌ ఇండియా ప్రచారానికి గూగుల్‌ అతి పెద్ద మద్దతుదారుగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత్‌ అత్యంత చైతన్యవంతమైన ఇంటర్నెట్‌ మార్కెట్‌ అని, పరిమాణం దృష్ట్యా రెండో అతిపెద్దదని పిచాయ్‌ పేర్కొన్నారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు
కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వంటి పరిజ్ఞానాలు, మెషీన్‌ లెర్నింగ్‌ వంటివి నిత్య జీవితాన్ని మరింత వినూత్నంగా మార్చగలవని సుందర్‌ అన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత మందికి చేరువ చేసేందుకు గూగుల్‌ భారీ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇలా కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగితే భవిష్యత్‌ కంప్యూటింగ్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. మెషీన్‌ లెర్నింగ్‌లో ముందడుగు వేస్తే చాలా రంగాల్లో భారీ మార్పు సాకారమవుతుందన్నారు. దీనికి ఉదాహరణగా కంటి చూపును దెబ్బతీసే డయాబెటిక్‌ రెటీనాను గుర్తించేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని సుందర్‌ వివరించారు.

  పశ్చిమ బెంగాల్‌లోని గోకుల్‌పూర్‌ గ్రామంలో గూగుల్‌ ‘ఇంటర్నెట్‌ సాథి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహిళలతో సుందర్‌
లోక జ్ఞానమూ అవసరమే...
ఐఐటీ పట్టభద్రులు ఐఐఎంలో సీటు సంపాదించాలన్న కలలతో ఉండడంపై పిచాయ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్య మాత్రమే కాదని, వాస్తవిక ప్రపంచ అనుభవాలూ ఎంతో ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తాను ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లో తరగతులకు బంక్‌ కొట్టిన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్న విషయాన్ని విన్న ఆయన ఖంగుతిన్నారు. సవాళ్లను స్వీకరించాలని, భిన్న విషయాల దిశగా ప్రయత్నం చేయాలని, తమ అభిరుచుల ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సుందర్‌ య్‌ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగంలో బీటెక్‌ పూర్తి చేయగా... 23 ఏళ్ల తర్వాత తిరిగి సందర్శించారు. బీటెక్‌ తర్వాత  స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. వార్టన్‌ స్కూల్లో ఎంబీయే అనంతరం 2004లో గూగుల్‌లో చేరి అత్యున్నత పదవిని అందుకున్నారు.

‘అబే సాలే’ అని పిలిచేవాడిని..
గూగుల్‌ బాస్‌గా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న సుందర్‌ పిచాయ్‌ సగటు భారతీయ విద్యార్థే. విద్యార్థిగా అతడిలోనూ చిలిపితనం, ఆకతాయితనం దాగున్నాయి. వాటిని ఐఐటీ ఖరగ్‌పూర్‌ వేదికగా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. స్నేహితులను ‘అబే సాలే (అరే బామ్మర్ది)’ అని పిలిచేవారట. ఎందుకని అలా..? అన్నదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘‘నేను చెన్నై నుంచి వచ్చాను. స్కూల్లో హిందీ చదువుకున్నాను. కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇతరులు ఎలా మాట్లాడుకుంటున్నారో మాత్రం వినేవాణ్ణి. ఒకానొక రోజు మెస్‌లో ఒకతన్ని ‘అబే సాలే’ అని పిలిచాను. దీన్ని స్నేహపూర్వక పలకరింపు అనుకున్నాను. కానీ, ఇందుకు మెస్‌లోని వారు కలత చెందినట్టు, ఆ తర్వాత మెస్‌ తాత్కాలికంగా మూసివేయడానికి అదే కారణమని తెలుసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. సుందర్‌ పిచాయ్‌ తన జీవిత భాగస్వామి అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌లోనే తొలిసారి కలుసుకున్నారట. అంజలిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అప్పట్లో అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లడం అంత తేలిక కాదని. దాంతో రొమాన్స్‌ సాధ్యపడేది కాదని ఆయన చెప్పారు. ‘‘ఎవరో ఒకరు బయట నుంచి ‘అంజలీ... సుందర్‌ నీకోసం ఇక్కడకు వచ్చాడు’ అంటూ గట్టిగా అరిచేవారు. దీంతో సిగ్గుగా అనిపించేంది’ అని ఆయన పేర్కొన్నారు. మొబైల్స్‌ ప్రపంచాన్నే మార్చేశాయని.. కానీ, కొన్నింటిని మార్చకుండా అలానే వదిలేశాయన్నారు. 23 ఏళ్ల క్రితం తన హాస్టల్‌ గది ఎలాఉందో ఇప్పుడూ అలానేఉందంటూ చమత్కరించారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, తెల్లారి క్లాసులు ఎగ్గొట్టేవాడినని చెప్పారు. 2004లో గూగుల్‌ ఇంటర్వూ్యను ఎదుర్కొన్న తాను జీమెయిల్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌గా భావించేవాడినన్నారు. కాలేజీ రోజుల్లో ఇన్ఫోసిస్‌  నారాయణమూర్తిని మార్గదర్శకంగా భావించిన ఆయన సచిన్‌ బ్యాట్‌ పట్టుకుంటే క్రికెట్‌ చూడ్డానికి ఇష్టపడేవాడినని చెప్పారు.
గోకుల్‌పూర్‌లో సరదాగా క్రికెట్‌ ఆడుతూ...

Related News By Category

Related News By Tags

Advertisement