భారత్‌కు బ్రిటన్ బీమా గ్రూప్ ఆర్‌ఎస్‌ఏ గుడ్‌బై
- రాయల్ సుందరం ఇన్సూరెన్స్‌లో 26 శాతం వాటాల విక్రయం
- డీల్ విలువ రూ. 450 కోట్లు
చెన్నై: బీమా సంస్థ రాయల్ సుందరం అలయన్స్‌లో తమకున్న 26 శాతం వాటాలను విక్రయించాలని బ్రిటన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఏ గ్రూప్ నిర్ణయించింది. తద్వారా భారత మార్కెట్ నుంచి వైదొలగనుంది. ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. ఆరు నెలల్లో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ఒకవైపు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాయల్ సుందరం అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇకపై సుందరం ఫైనాన్స్‌కి పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది. 2000లో బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతినిచ్చినప్పుడు మొట్టమొదటిగా లెసైన్సు పొందిన సంస్థ రాయల్ సుందరం అలయన్స్. ప్రస్తుతం వాహన, వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ తదితర బీమా పాలసీలు అందిస్తోంది. ఆర్‌ఎస్‌ఏ భాగస్వామ్యంతో గత 15 సంవత్సరాలుగా బీమా రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగలిగినట్లు సుందరం ఫైనాన్స్ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్ తెలిపారు. కీలకమైన మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టే దిశగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌ఎస్‌ఏ గ్రూప్ సీఈవో స్టీఫెన్ హెస్టర్ పేర్కొన్నారు.