హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా వచ్చే మూడేళ్లలో మరో ఐదు మోడళ్లను పరిచయం చేయనుంది. వీటిలో మూడు బైక్‌లు, రెండు స్కూటర్లు రానున్నాయి. 2014లో కంపెనీ నాలుగు కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. భారతీయ మార్కెట్లో వాటా పెంచుకోవాలంటే నూతన మోడళ్లు, పంపిణీపై దృష్టిపెట్టడమే మార్గమని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్త తెలిపారు.
హైదరాబాద్ మార్కెట్లో 155 సీసీ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ జిక్సర్‌ను బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా అతుల్ గుప్త సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. భారతీయ మార్కెట్ కోసం వివిధ మోడళ్లను జపాన్‌లోని సుజుకి పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రంలో డిజైన్ చేస్తున్నారని చెప్పారు. జిక్సర్‌తోపాటు ఇటీవల విడుదలైన లెట్స్ స్కూటర్ జపాన్ ఆర్‌అండ్‌డీ కేంద్రంలో డిజైన్ చేసినవే.
రెండేళ్లలో 10 లక్షలు: హర్యానాలోని గుర్‌గావ్ వద్ద ఉన్న కంపెనీ ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 5.4 లక్షల ద్విచక్ర వాహనాలు. ప్లాంటు విస్తీర్ణం 37 ఎక రాలు. ప్రస్తుతం 10 ఎకరాలను మాత్రమే వినియోగించారు. భవిష్యత్ విస్తరణ ఈ ప్లాంటు వద్దే ఉంటుందని, రెండేళ్లలో తయారీ సామర్థ్యాన్ని 10 లక్షలకు చేరుస్తామని అతుల్ గుప్త పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. నెలకు 2 వేల యూనిట్లు ఎగుమతి చేస్తోంది. కంపెనీ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 10 శాతంగా ఉంది.
50,000 జిక్సర్ బైక్‌లు..
సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్(ఎస్‌ఈపీ) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జిక్సర్ బైక్‌ను రూపొందిం చారు. వాహన సామర్థ్యంతో సంబంధం లేకుండా అధిక మైలేజీ ఇవ్వడం ఎస్‌ఈపీ టెక్నాలజీ ప్రత్యేకత. సుజుకి తొలిసారిగా ఎస్‌ఈపీని భారతీయ మార్కెట్ కోసం అభివృద్ధి చేసిందని కంపెనీ మార్కెటింగ్ నేషనల్ హెడ్ అను అనామిక తెలిపారు. 18-22 ఏళ్ల వయసున్న యువతను దృష్టిలో పెట్టుకుని జిక్సర్ బైక్‌కు రూపకల్పన చేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 వేల జిక్సర్ బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ద్విచక్ర వాహన రంగంలో కంపెనీకి ప్రస్తుతం 3 శాతం వాటా ఉంది. 6-12 నెలల్లో ఇది 5 శాతానికి ఎగబాకుతుందని సుజుకి అంచనా వేస్తోంది.
మూడేళ్లలో అయిదు కొత్త మోడళ్లు
Published Thu, Sep 18 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement