బెంగళూరు: ఆన్‌లైన్‌లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తే డెలివరీ చేసే స్విగ్గీ మరిన్ని డెలివరీ సేవల్లోకి ప్రవేశించే ప్రణాళికలతో ఉంది. ఔషధాలు, గ్రోసరీలను కూడా డెలివరీ చేయడం ద్వారా తన ప్లాట్‌ఫామ్ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటోంది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు ఈ వివరాలు వెల్లడించాయి.
పలు విభాగాల్లోకి అడుగు పెట్టే విషయమై చర్చ జరిగిందని, తొలుత ఔషధాల డెలివరీ సేవలను ప్రారంభించి, అనంతరం గ్రోసర్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. స్విగ్గీ సంస్థకు దేశవ్యాప్తంగా 30,000 మందితో బలమైన డెలివరీ నెట్‌వర్క్ ఉంది. ఖాళీ సమయాల్లో వారిని వినియోగించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు భిన్న సేవల్లోకి ప్రవేశించాలనుకుంటోంది.
ముఖ్యంగా రోజులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డెలివరీ నెట్‌వర్క్ చాలా వరకు పనిలేకుండా ఉంటోంది. దీంతో వీరిని ఇతర సేవలకు వినియోగించుకోవాలన్నది వ్యూహం. దీనికి ‘డాష్’ అనే పేరును కంపెనీ పరిశీలిస్తోంది. వచ్చే కొన్ని నెలల్లోనే ప్రయోగాత్మకంగా కొత్త సేవలను ప్రారంభించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
ప్రయత్నాలు కొనసాగుతాయి..
నూతన ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని స్విగ్గీ వెల్లడించలేదు. అయితే, కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయమై స్పందిస్తూ ‘‘స్విగ్గీ స్థాయిలో మా వినియోగదారులు, భాగస్వాముల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి’’ అని తెలిపారు. మరోవైపు డీఎస్టీ గ్లోబల్, కోట్ మేనేజ్‌మెంట్ హెడ్జ్ ఫండ్‌ల నుంచి 200 మిలియన్ డాలర్ల సమీకరణకు స్విగ్గీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కంపెనీ విలువ బిలియన్ డాలర్లను అధిగమించనుంది.
పరిశ్రమ గణాంకాల ఆధారంగా చూస్తే దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన 35,000 రెస్టారెంట్లకు సంబంధించి ప్రతీ నెలా 70 లక్షల ఆర్డర్లను స్విగ్గీ నిర్వహిస్తోంది. గత నెలలో జొమాటో తాను భారత్, బ్రిటన్‌లో కలిపి 55 లక్షల ఆర్డర్ల మార్క్‌నకు చేరినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. స్విగ్గీ ప్రణాళికల వెనుక పెట్టుబడిదారుల ఒత్తిడి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
భిన్న సేవలను డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్‌గా మార్చడం ద్వారా చైనా మాదిరే ఇక్కడ కూడా విజయం సాధించాలన్న వ్యూహంతో ఇన్వెస్టర్లు ఉన్నారు. మీటన్–డిన్‌పింగ్, దిది చుక్సింగ్, అలీబాబా సంస్థలు స్విగ్గీ, ఓలా, జొమాటోలో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా స్విగ్గీ వ్యూహం చైనాలో మీటన్ డిన్‌పింగ్ చైనా నమూనాను ప్రతిఫలించేలా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ సంస్థ కూడా చైనాలో బహుముఖ సేవలను డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్‌గా ఉంది.
గ్రోసరీలు, బ్యూటీ సెలూన్, ఫుడ్ డెలివరీ సహా ఎన్నో సేవల్లో ఉంది. నిజానికి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇతర విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా తమ నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానమే. తాజాగా అమెరికాకు చెందిన డోర్‌డ్యాష్ సంస్థ వాల్‌మార్ట్ సరుకులను డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment