‘సలామ్’ కొడితే రుణం!
♦ సిబిల్ స్కోర్ కాదు.. నెటిజన్ల లైక్‌లు చాలు
♦ వ్యక్తిగత రుణాలకు టాటా క్యాప్ కొత్త రూటు
♦ సోషల్ మీడియా ఓట్లకు అగ్రాసనం; గరిష్ట పరిమితి రూ.లక్ష
♦ 3లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి చాన్స్
ముంబై: వ్యక్తిగత రుణాలకు టాటా క్యాపిటల్ సోషల్ మీడియా టచ్ ఇచ్చింది. టీవీల్లో డ్యాన్స్, మ్యూజిక్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ప్రదర్శన నచ్చితే ఓటు వేసి గెలిపించాలని వీక్షకులను కోరడం తెలిసిందే. ఇదే మాదిరిగా రుణాలు కావాలనుకున్న వారు కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఓట్లను గెలవాల్సి ఉంటుంది. ఎన్ని ఓట్లు వచ్చాయనేదాన్ని బట్టి వారికి రూ.లక్ష వరకూ రుణాన్ని టాటా క్యాపిటల్ మంజూరు చేస్తుంది. అదీ కథ.
ప్రక్రియ ఇలా...
వ్యక్తులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన, తక్కువ ఆదాయ వర్గాల వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు దాటని వారు ఈ రుణాలను పొందొచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. దరఖాస్తుదారులు రుణం ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పాలి. అప్పుడు ఆ సమాచారాన్ని టాటా క్యాపిటల్ ఠీఠీఠీ. ఛీౌటజీజజ్టి. జీn అనే వెబ్‌సైట్‌లో 3, 4 వారాల పాటు ప్రదర్శిస్తుంది. సోషల్, డిజిటల్ మీడియా వేదికలపై దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది.
ఈ దరఖాస్తు భవితవ్యాన్ని తేల్చాల్సింది నెటిజన్లే. సంబంధిత దరఖాస్తుదారుడికి తమ మద్దతును ‘సలామ్’ అంటూ తెలియజేస్తే చాలు. అది రుణం ఆశిస్తున్నవారికి ప్లస్ అవుతుంది. ఓ రుణ దరఖాస్తుకు తగినన్ని లైక్స్ లేదా సలామ్‌లు వస్తే అప్పుడు దాన్ని రుణానికి ప్రాథమిక అర్హతగా టాటా క్యాపిటల్ తీసుకుంటుంది. నాణ్యతా సమీక్ష చేపడుతుంది. దరఖాస్తుదారుడితో మాట్లాడి, అతడి రుణ అవసరాలు, చిత్తశుద్ధిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిద్వారా మోసపూరిత దరఖాస్తులను నివారించొచ్చన్నది కంపెనీ యోచన.
దరఖాస్తు దారుడికి లాభమేంటి..?
రుణం కోసం ఇన్ని పాట్లు అవసరమా...? అనుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఇలా ఎక్కువ సలామ్‌లను గెలుచుకున్న వారికి మార్కెట్‌లో ఉన్న వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే రెండు నుంచి మూడు శాతం తక్కువకే రూ.లక్ష వరకు రుణాన్ని టాటా క్యాపిటల్ అందజేస్తుంది. మరో ప్రయోజనం ఏంటంటే... రుణం పొందేందుకు సిబిల్ స్కోరు అవసరం లేదు. ఒకరి హామీ కూడా అక్కర్లేదు. టాటా క్యాపిటల్ రిటైల్ బిజినెస్, హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోవింద్ శంకరనారాయణన్ దీనిపై స్పందిస్తూ... ‘‘ఈ ప్రయత్నం పరిశ్రమ ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుంది. ఇతర రుణదాతల్లోనూ నమ్మకం ఏర్పడుతుంది.
రుణాలకు ఈ గ్రూపులు (తక్కువ ఆదాయ వర్గాలు) కూడా అర్హులేనని అర్థం చేసుకుంటారు’’ అని చెప్పారు. విద్యావసరాలు, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసమూ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. ఉదాహరణకు కిరణ్‌జోహార్ ఉన్నత విద్య కోసం రూ.88వేలు రుణం కావాలంటూ టాటా క్యాపిటల్‌కు చేసుకున్న దరఖాస్తుకు ఇప్పటి వరకు 96 సలామ్‌లు వచ్చాయి. నాసిక్‌కు చెందిన రూపేష్ బలరావ్ చిన్నప్పుడే పోలియోతో అంగవైకల్యం బారినపడ్డాడు. ఓ జనరల్ స్టోర్ పెట్టుకుని తన కాళ్లపై తాను నిలబడాలని ఆశించాడు. రుణం కావాలని బ్యాంకులను కోరితే తిరస్కరణ ఎదురైంది. ఇప్పుడు ఇతడి కథనాన్ని టాటా క్యాపిటల్ ఆన్‌లైన్‌లో ఉంచగా 123 ఓట్లు వచ్చాయి.