టాటాలో సంచలనం: భారీగా ఉద్యోగాల కోత
టాటాలో సంచలనం: భారీగా ఉద్యోగాల కోత
Published Fri, Jun 23 2017 8:41 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
టాటా మోటార్స్ లో భారీ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్ నిర్మాణ ప్రక్రియను టాటా మోటార్స్ చేపట్టింది. ఈ పునర్ నిర్మాణ చర్యలతో దాదాపు 1200-1300 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. అంతేకాక వేరే యూనిట్లకు తరలి వెళ్లాలని లేదంటే కంపెనీ విడిచిపెట్టాలని ఉద్యోగులకు నిర్మోహమాటంగా టాటా మోటార్స్ యాజమాన్యం చెప్పేస్తోంది. ఇప్పటికే 2500 పొజిషన్లను కంపెనీ తీసివేసింది.
కంపెనీ తొలగించిన వీరిలో ఎక్కువగా కిందిస్థాయి వారే ఉన్నారని తెలిసింది. టాటా మోటార్స్ లో ఈ పునర్ నిర్మాణ చర్యలు చేపట్టకపోతే, ఉద్యోగుల ఖర్చులు రూ.400-రూ.500 కోట్లు పెరిగే అవకాశముందని కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ గజేంద్ర చందెల్ అన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ఎక్కువని, ఈ ఏడాది బడ్జెట్ రూపొందించేటప్పుడే కొత్త రూపురేఖలను సిద్ధంచేశామని, దీంతో రూ.400 కోట్లను తగ్గించుకోవచ్చని అంచనావేసినట్టు చెప్పారు.
సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని, 1500 మంది మేనేజింగ్ డైరెక్టర్లను తొలగించే యోచనలో ఉన్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యుయెంటర్ బచక్ అంతకముందే పేర్కొన్నారు. గత 18 నెలల్లో టాటా మోటార్స్ లో 2500 వైట్-కాలర్ పొజిషన్లు ఖాళీ అయ్యాయని, ఇవి పొదుపుకు సహకరిస్తున్నాయని కంపెనీ చెప్పింది. వచ్చే రెండు-మూడేళ్లలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా 3000 వరకు తగ్గిపోయే అవకాశముంది.
ప్రస్తుతం కంపెనీలో 30వేల మంది బ్లూ-కాలర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 10 శాతం తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ ప్లాంట్ల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కంపెనీ 10 శాతం వేతనాన్ని పనితీరు ఆధారితానికి లింక్ చేసింది. అయితే టాటా మోటార్స్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి నష్టాలనే నమోదుచేస్తోంది. బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీతో 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.2,480 కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది.
Advertisement