సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో మైలురాయిని తాకింది. మార్కెట్ క్యాప్‌లో ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన టీసీఎస్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో రికార్డ్ స్థాయితో మొదటి స్థానంలో నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 7లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్‌ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో టీసీఎస్ షేరు రూ.3674 వద్ద ఆల్ టైంహైని టచ్ చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 7.01 లక్షల కోట్లను తాకింది. కేవలం నెలరోజుల్లో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7 లక్షల కోట్లను సాధించడం విశేషం. ఏప్రిల్ 16 నుంచి టీసీఎస్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 5.81 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో ఉంది.
టీసీఎస్ ఇటీవల క్యూ4లో మెరుగైన ఫలితాలు ప్రకటించడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ఊపందుకుని షేరు జోరుకి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. అలాగే డాలరు మారకంలో రూపాయి బలహీనత, గత రెండేళ్లలోలేని విధంగా డాలర్ ఆదాయంలో రెండంకెల వృద్ధిని సాధించడం , ఇటీవలి ఒప్పందాలు దాహదపడినట్టు తెలిపారు. దీనికితోడు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రతిపాదించడం కూడా సానుకూలం అంశమని పేర్కొన్నారు. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి ఐటీ షేర్లు భారీగా మద్దతునిస్తున్నాయి. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్ కూడా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment