ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకు తగ్గ ఫలితాలను వెల్లడించింది. 2017 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో క్వార్టర్- క్వార్టర్‌కు నికర లాభాలు 1.3 శాతం పెరిగి రూ.6,531 కోట్లగా రికార్డైనట్టు టీసీఎస్ పేర్కొంది. 2017 సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.6,443 కోట్లగా ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం డిసెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్ రూ.6532.70 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. వీరి అంచనాలకు తగ్గట్లే టీసీఎస్ తన లాభాలను ప్రకటించింది. త్రైమాసిక సమీక్ష సందర్భంగా కంపెనీ మొత్తం ఆదాయం క్వార్టర్‌కు 1.32 శాతం పెరిగి రూ.31,774 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. ఫలితాల వెల్లడి క్రమంలో ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిండెట్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ మూడో మధ్యంతర డివిండెట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కు 2018 జనవరి 31 వరకు చెల్లించనున్నట్టు టీసీఎస్ తెలిపింది.
ఫైనాన్స్, కాస్ట్‌లకు ముందు కంపెనీ లాభాలు 2 శాతం పెరిగి రూ.8651 కోట్లగా ఉన్నట్టు టీసీఎస్ పేర్కొంది. 50 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో ముగ్గురు క్లయింట్లను, 20 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో ఏడుగురిని, 10 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో తొమ్మిది మందిని, 5 మిలియన్ ప్లస్ డాలర్ల బ్యాండ్‌లో 15 మంది క్లయింట్లను చేర్చుకున్నట్టు టీసీఎస్ పేర్కొంది. ఈ క్వార్టర్‌లో తాము తొలిసారి 50 మిలియన్ ప్లస్ డాలర్ల డీల్‌పై సంతకం చేసినట్టు టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ తెలిపారు. డిజిటల్ టెక్నాలజీస్‌లో తాము ఎంతో కీలకమైన మైలురాయిని అధిగమించినట్టు పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ బేసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ3లో 39,0880కి పెరిగింది. స్థూలంగా కంపెనీలోకి తీసుకున్న ఉద్యోగులు 12,534 మంది ఉండగా... నికరంగా 1,667 మంది ఉన్నారు.ఫలితాల ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేర్లు 0.67 శాతం నష్టంలో రూ.2,788.40 వద్ద స్థిరపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment