
టీసీఎస్ షేర్ల బైబ్యాక్‌కు ఓకే
టీసీఎస్ వాటాదారులు రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో 99.81% ఓట్లు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది.
♦ ఒక్కో షేర్ బైబ్యాక్ ధర రూ.2,850
♦ మొత్తం బైబ్యాక్ విలువ రూ.16,000 కోట్లు
న్యూఢిల్లీ: టీసీఎస్ వాటాదారులు రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం పోలైన ఓట్లలో 99.81% ఓట్లు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు అనుకూలంగా వచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. ఈ బైబ్యాక్‌లో భాగంగా చెల్లించిన ఈక్విటీ మూలధనంలో 2.85 శాతం వాటాకు సమానమైన 5.61 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.2,850కు టీసీఎస్ కంపెనీ కొనుగోలు చేయనున్నది.
షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. కాగా టీసీఎస్ కంపెనీ టెండర్ ఆఫర్ విధానంలో షేర్లను బైబ్యాక్ చేయనున్నది. మంగళవారంనాడు 2016–17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ఈ కంపెనీ వెల్లడించనున్న నేపథ్యంలో షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించడం విశేషం. ఈ బైబ్యాక్ విజయవంతమైతే భారత్‌లో ఇదే అతి పెద్ద బైబ్యాక్ కానున్నది. 2012లో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,400 కోట్ల బైబ్యాక్.. ఇప్పటిదాకా అతి పెద్దది.