న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘2022 బుర్గుండీ ప్రైవేటు హరూన్ ఇండియా 500’ జాబితా మంగళవారం విడుదలైంది. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
రూ.9.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనంతరం రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరికొన్ని ప్రత్యేకతలు కూడా సొంతం చేసుకుంది. 2022–23 సంవత్సరానికి రూ.67,845 కోట్ల లాభంతో అత్యంత లాభదాయక సంస్థగానూ ఉంది. అలాగే, అత్యధికంగా రూ.16,297 కోట్ల పన్నును చెల్లించింది.
సీరమ్ ఇనిస్టిట్యూట్
అన్‌లిస్టెట్ కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.1.97 లక్షల కోట్లుగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ రూ.1.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. రూ.69,100 కోట్లతో బైజూస్ మూడో అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ సంస్థగా ఉంది.
2022 అక్టోబర్ 30 నుంచి 2023 ఏప్రిల్ 30 మధ్య ఆరు నెలల కాలంలో దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువల వ్యత్యాసాన్ని బర్గుండీ ప్రైవేటు, హరూన్ ఇండియా ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించాయి. మార్కెట్ విలువ ఆధారంగానే వాటికి ర్యాంకులను కేటాయిస్తుంటాయి. దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువ 2022 అక్టోబర్ 30 నాటికి రూ.227 లక్షల కోట్లుగా ఉండగా, 2023 ఏప్రిల్ 30 నాటికి 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు పరిమితమైంది.
టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.71.5 లక్షల కోట్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 37 శాతానికి సమానం. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. అదానీ గ్రూపులో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 52 శాతం క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment