
విజయా బ్యాంక్ లాభం 39 శాతం డౌన్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ విజయా బ్యాంక్ నికర లాభం జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 39%పైగా క్షీణించి రూ. 136 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 224 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మార్క్‌ట్ మార్కెట్(ఎం టు ఎం) నష్టాలవల్ల లాభాలు దెబ్బతిన్నట్లు బ్యాంకు చైర్మన్ వి.కన్నన్ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 149 కోట్ల నుంచి రూ. 99 కోట్లకు తగ్గినప్పటికీ పునర్వ్యవస్థీకరించిన రుణాల ప్రొవిజన్లు రూ. 42 కోట్ల నుంచి రూ.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఎంటుఎం నష్టాలు రూ. 71 కోట్లుగా చెప్పారు.
కాగా, ఈ కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 2,680 కోట్ల నుంచి రూ. 3,029 కోట్లకు ఎగసింది. రూ. 526 కోట్ల నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) లభించగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.21% నుంచి 1.92%కు క్షీణించాయి. నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.3% నుంచి 1.55%కు పెరిగాయి. పూర్తి ఏడాదికి(2013-14) ఆదాయం రూ. 9,659 కోట్ల నుంచి రూ. 11,416 కోట్లకు పుంజుకుంది. నికర లాభం 29% క్షీణించి రూ. 417 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం రూ. 586 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంకు షేరు యథాతథంగా రూ. 41 వద్దే ముగిసింది.