విజయాబ్యాంక్ బేస్ రేటు కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విజయాబ్యాంక్ కనీస (బేస్) రుణ రేటు స్వల్పంగా 0.15 శాతం తగ్గింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.85 శాతానికి చేరింది. బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ విషయాన్ని తెలియజేసింది. సెప్టెంబర్ 4 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు- రెపో ఈ ఏడాది ముప్పావు శాతం తగ్గింది (ప్రస్తుతం 7.25 శాతం).
ఈ ప్రయోజనంలో దాదాపు సగ భాగాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ‘బేస్ రేటు’ తగ్గింపు రూపంలో కస్టమర్లకు బదలాయించాయి. బేస్ రేటు తగ్గింపు వల్ల దానికి అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా రుణాలపై నెలవారీ చెల్లింపుల భారం తగ్గుతుంది. తదుపరి రెపో కోత ప్రకటించాలంటే... మొదట ఈ ఏడాది తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తిగా బదలాయించాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదేపదే చెబుతున్నారు. కాగా కొన్ని బ్యాంకులు రుణ రేటు తగ్గింపునకు మార్గం సుగమం చేసుకుంటూ ‘మార్జిన్లు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యంగా’ తొలుత డిపాజిట్ రేటు తగ్గింపుపైనా కసరత్తు చేస్తున్నాయి.