పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఆన్‌లైన్ కాలిక్యులేటర్
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కంప్యూటర్ ఆధారిత కొత్త ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిసాయంతో అసెస్సీలు వార్షికంగా తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చాలా సులువుగా సరిచూసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2015-16 అసెసెమెంట్ ఇయర్‌లో పన్ను చెల్లింపుదారులకోసం కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాల(ఐటీఆర్)ను సీబీడీటీ ఇటీవలే నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబ్‌లు, రేట్లకు సబంధించి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్‌లో తగిన మార్పుచేర్పులు చేశారు. వ్యక్తిగత, కార్పొరేట్ లేదా ఇతరత్రా ఏ సంస్థలైనా తమ పన్ను లెక్కింపు కోసం కొత్త కాలిక్యులేటర్‌ను వాడొచ్చని ఆయా వర్గాలు వివరించాయి. అయితే, కొన్ని సంక్లిష్టమైన కేసుల విషయంలో ఐటీఆర్‌లలో విభిన్న అంశాలు ఉంటాయని.. అందువల్ల ఆయా అసెస్సీలు పూర్తిగా ఈ కాలిక్యులేర్‌పైనే ఆధారపడవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు.