అత్యంత సంపన్న ట్రస్టు... గేట్స్‌దే!
ఆస్తుల విలువ 43.4 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ : ఏకంగా 43.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో అత్యంత సంపన్న ప్రైవేట్ చారిటబుల్ సంస్థల జాబితాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మొత్తం మన కరెన్సీలో రూ.2.75 లక్షల కోట్లపైమాటే. 8.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో లీ కా షింగ్ ఫౌండేషన్ రెండో స్థానం, గోర్డన్ అండ్ బెట్టీ మూర్ (6.4 బిలియన్ డాలర్లు) మూడో స్థానం దక్కించుకున్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత సంపన్నులు స్థాపించిన సామాజిక సేవా సంస్థలతో కూడిన ఈ జాబితాను వెల్త్-ఎక్స్ రూపొందించింది. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తులన్నీ కలిపి చూసినా కూడా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు సమానంగా లేవు.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్ పేరిట ఇది ఏర్పాటైంది. ఇక రెండో స్థానంలో ఉన్న లీ కా షింగ్ ఫౌండేషన్‌ను హాంకాంగ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం లీ కా షింగ్ నెలకొల్పారు. దీన్ని తన మూడో కుమారుడిగా చెప్పుకునే షింగ్... తన ఆస్తుల్లో మూడో వంతును ఫౌండేషన్‌కు రాసిచ్చారు. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తుల విలువ 83.1 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇది వాటిని స్థాపించిన వారి మొత్తం ఆస్తుల విలువలో సుమారు 29.7%. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్నులు నెలకొల్పిన ఫౌండేషన్లు 5,000 పైచిలుకు ఉన్నాయి. వీటన్నింటి ఆస్తుల విలువ 560 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది.