
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని మొత్తం గ్యాస్ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఏపీలోని కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ నుంచే ఉత్పత్తవుతున్నట్లు హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ ఆంతనూ చక్రవర్తి తెలియజేశారు. ‘‘దేశంలో రోజుకు 80 మిలియన్ ఘనపుటడుగుల (ఎంఎంసీఎం) గ్యాస్ ఉత్పత్తవుతోంది. దీన్లో కేజీ బేసిన్‌లోనే రెండు కంపెనీల నుంచి 43–45 ఎంఎంసీఎం ఉత్పత్తవుతోంది. దీన్లో ఓఎన్‌జీసీ వాటా 15–18 ఎఎంసీఎం కాగా ప్రైవేట్ సంస్థది 25–30 ఎంఎంసీఎం ఉంటుంది. గతంలో ఈ రెండు కంపెనీలూ కేజీ బేసిన్ నుంచి రోజుకు 65 ఎంఎంసీఎం గ్యాస్ ఉత్పత్తి చేసేవి. కానీ, ఇప్పుడది తగ్గింది’’ అని ఆయన వివరించారు. ఉత్పత్తి తగ్గటానికి ఆయన పలు కారణాలను వెల్లడించారు. కేజీ బేసిన్‌లో ఒక్కోచోట 1,200–2 ,600 మీటర్ల లోతు నీళ్లుంటాయని అందుకే చమురు ఉత్పత్తి సవాల్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ (హెచ్‌ఈఎల్‌పీ) కింద ఓపెన్ ఆర్కేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఓఏఎల్‌పీ) వేలం జరిగింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో 55 బ్లాక్స్‌కు వేలం నిర్వహించిన సందర్భంగా జాయింట్ సెక్రటరీ (ఎక్స్‌ప్లోరేషన్) దివాకర్ నాథ్ మిశ్రాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన ఈ విషయాలు చెప్పారు.
రూ.91 వేల కోట్ల పెట్టుబడులు..
2021–2023 నాటికి కేజీ బేసిన్‌లో రెండు ప్రధాన చమురు, గ్యాస్ అన్వేషణ– ఉత్పత్తి కంపెనీల నుంచి సుమారు రూ.91 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆంతనూ అంచనా వేశారు. ప్రస్తుతం ఓఏఎల్‌పీ వేలం నిర్వహిస్తున్న 55 బ్లాక్స్‌లో 5 బ్లాక్స్ (3 ఆన్‌ల్యాండ్, 2 ఆఫ్‌షోర్) కేజీ బేసిన్‌లోనే ఉన్నాయి. కాగా కేజీ బేసిన్ ఆన్‌ల్యాండ్ 28 వేల చ.కి.మీ., ఆఫ్‌షోర్ 2.02 లక్షల చ.కి.మీ. విస్తరించి ఉంటుంది. ఏప్రిల్ 3తో వేలం ముగుస్తుంది. మరో 15 రోజులు పొడిగించే అవకాశముంది.
2020 నాటికి తొలి చమురు ఉత్పత్తి..
‘‘ప్రస్తుతం దేశంలో 70 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదే. 2040 నాటికి దీన్ని 11 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకే 2016లో హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ పాలసీని తీసుకొచ్చాం’’ అని అంతనూ తెలిపారు. ఇందులో భాగంగా గతేడాది మార్చిలో డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ (డీఎస్‌ఎఫ్)–1 వేలం నిర్వహించామంటూ... ‘‘23 కంపెనీలతో 30 ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 13 కంపెనీలు కొత్తవే. వీటి నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూ.9,300 కోట్లు, రాయల్టీగా రూ.5 వేల కోట్ల వాటా వస్తుంది. రాయల్టీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే నెలలో డీఎస్‌ఎఫ్–2లో 60 బ్లాక్స్ వేలం ప్రారంభమవుతుందన్నారు.
ఏటా చమురు డిమాండ్ 4.5–5 శాతం వృద్ధి..
ప్రస్తుతం దేశంలో 37 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు ఉత్పత్తి అవుతుండగా.. డిమాండ్ మాత్రం 100–120 మిలియన్ మెట్రిక్ టన్నులుందని, అలాగే రోజుకు 80 ఎంఎంసీఎఫ్ గ్యాస్ ఉత్పత్తి ఉండగా.. 140 ఎంఎంసీఎఫ్ డిమాండ్ ఉందని చెప్పారాయన. ఏటా 4.5–5 శాతం డిమాండ్ పెరుగుతోందని.. అదే విదేశాల్లో అయితే 1–1.5 శాతం వరకే పెరుగుదల పరిమితమవుతోందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment