రియల్టీకి టైమొచ్చింది! | this time for reality big company's looking to hyderabad | Sakshi
Sakshi News home page

రియల్టీకి టైమొచ్చింది!

Published Fri, Jul 15 2016 10:24 PM | Last Updated on Thu, Sep 6 2018 10:05 PM

రియల్టీకి టైమొచ్చింది! - Sakshi

రియల్టీకి టైమొచ్చింది!

దిగ్గజ కంపెనీల చూపుహైదరాబాద్ వైపు
తొలి కేంద్రాల ఏర్పాటుతో రంగంలోకి కంపెనీలు
3-4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 25 లక్షల ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు
రానున్న రోజుల్లో స్థిరాస్తి వ్యాపారానికి పండగేనంటున్న నిపుణులు

హైదరాబాద్.. మహా నగరం నుంచి విశ్వ నగరం వైపు శరవేగంగా అడుగులేస్తోంది. బెంగళూరు, ముంబై, చెన్నై, ఎన్‌సీఆర్‌లను కాదని అంతర్జాతీయ కంపెనీలు అమెరికా తర్వాత తమ తొలి కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. పారిశ్రామిక, ఐటీ పాలసీతో ప్రోత్సహిస్తున్న స్థానిక ప్రభుత్వం.. మెరుగైన మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్‌ఆర్, ఎక్స్‌ప్రెస్ హైవేలతో సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు, అందుబాటులో స్థిరాస్తి ధరలూ.. ఇవీ విదేశీ కంపెనీల రాకకు కారణం. దీంతో రానున్న రోజుల్లో భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ పట్టాలెక్కుతుందని నిర్మాణ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి.

ఐటీ రంగంలో హైదరాబాద్‌తో పోల్చుకుంటే బెంగళూరు, చెన్నై నగరాలు ముందుంటాయి. కానీ, ఇప్పుడా మెట్రోలు స్తబ్ధత స్థాయికి చేరుకున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఎక్కడి నుంచైనా సరే విమానాశ్రయానికి చేరుకోవాలంటే పద్మవ్యూహాన్ని చేధించాల్సిందే. కాలుష్యం విపరీతంగా పెరిగింది. భూగర్భ జలాలూ  అడుగంటుతున్నాయి. దీంతో కూల్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరు.. హాట్‌సిటీ మారుతోంది. చెన్నై విషయానికొస్తే.. వరదల ముప్పు. కొన్ని నెలల క్రితం వచ్చిన అనూహ్యమైన వరదలు కార్పొరేట్ సంస్థలను ఆలోచింపజేస్తున్నాయి. బ్యాక్ ఆఫీసు వంటి కీలకమైన ఆపరేషన్లకు చెన్నై సేఫ్ కాకపోవచ్చనే అనుమానమూ మొదలైందిప్పుడు. పెపైచ్చు రాజకీయ ఒత్తిళ్లు. దీంతో కొన్నేళ్ల పాటూ హైదరాబాద్ అంటే ఆలోచించిన కంపెనీలు.. ఇప్పుడు తమ తొలి కేంద్రాల ఏర్పాటుకు నగరాన్నే ఎంచుకుంటున్నాయి.

ప్రస్తుతం నగరంలో సుమారు 8 కోట్ల చ.అ. స్థలంలో 1,300లకు పైగా ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్నాయి. వీటికి తోడుగా యాపిల్, సేల్‌ఫోర్స్, గూగుల్ వంటి కంపెనీలు 3-4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 25 లక్షల మందికి, పరోక్షంగా వేలాది మంది ఉద్యోగ అవకాశాలొస్తాయని అంచనా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల విలువ.. ప్రస్తుతం రూ.75 వేల కోట్లకు చేరింది. జాతీయ వృద్ధి రేటు (12.3 శాతం) కంటే తెలంగాణ వృద్ధి రేటు (13.26 శాతం) ఎక్కువే. స్టార్టప్ కంపెనీల విషయానికొస్తే.. 1,000కి పైగా కంపెనీలు కొలువుదీరాయిక్కడ. సంస్థలకు అవసరమైన నిపుణులను తయారుచేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

1 చ.అ. కమర్షియల్ స్థలం అమ్ముడయ్యిందంటే.. 200 చ.అ. రెసిడెన్షియల్ స్థలం అవసరముంటుందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో నగరంలో నివాస, వాణిజ్య అవసరాలకు ఢోకాలేదని చెప్పాలి. ఎందుకంటే సేల్స్‌ఫోర్స్ 2 లక్షల చ.అ., యాపిల్ 2.50 లక్షల చ.అ., గూగుల్ 20 లక్షల చ.అ., ఫ్లిప్‌కార్ట్ 2.20 లక్షల చ.అ., అమెజాన్ 2.80 లక్షల చ.అ., కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి మరి. ఇప్పటికే ఈ-కామర్స్, హెల్త్ కేర్ సంస్థలు నగరంలో సుమారు 3-4 మిలియన్ల స్థలం అద్దెకు తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, త్వరలోనే పట్టాలెక్కనున్న మెట్రో రైలు.. వంటివి భాగ్యనగరానికి అదనపు ఆభరణాలుగా నిలుస్తున్నాయి.

నగరానికొస్తున్న కంపెనీల్లో చాలా వరకూ పశ్చిమ జోన్ కేంద్రంగానే వస్తున్నాయి. దీంతో గచ్చిబౌలి నుంచి అప్పా జంక్షన్ వరకు రోడ్డుకిరువైపులా 2 కి.మీ. వరకూ స్థిరాస్తి వ్యాపారం బాగుంటుంది. మాదాపూర్, నార్సింగి, రాయదుర్గం, పుప్పాలగూడ, బండ్లగూడ, రాజేంద్రనగర్, ప్రాంతాల్లో భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నాయి. మరో 10-15 ఏళ్ల వరకు ఇక్కడి స్థిరాస్తి వ్యాపారానికి ఢోకా లేదు. ఇతర జోన్లలో స్థిరాస్తి వ్యాపారం అంతగా వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం.. విమానాశ్రయానికి దూరంగా ఉండటం, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధిని నగరం నలువైపులా విస్తరింపజేయాలంటే గ్రోత్ కారిడార్ వెంట విస్తరణ, ఫార్మాసిటీ పనుల్లో పురోగతి, యాదాద్రి అభివృద్ధి వంటివి చేపట్టాలి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లో కనీసం 30 శాతం తక్కువ ధరలతో ఇక్కడ నిర్మాణం పూర్తవుతుంది. సిమెంట్, లేబర్, ల్యాండ్ అన్నీ తక్కువగా ఉండటం వల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలకూ కొదవేలేదిక్కడ. ఆరు స్టేట్ వర్సిటీలు, రెండు ప్రై వేట్ వర్సిటీలు, రెండు డీమ్డ్ వర్సిటీలు, మూడు సెంట్రల్ వర్సిటీలకు హైదరాబాద్ కేంద్రం. టీహబ్ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల యంగ్ టాలెంట్ డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ కంపెనీలను విరివిగా ఆకర్షిస్తుంది. ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించడంతో పాటూ సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుంది. ఐటీ మంత్రి స్వయంగా విదేశాలను సందర్శించి కంపెనీలతో భేటి అవుతున్నారు. ఇక్కడ ఉన్న అవకాశాలను, ప్రభుత్వ ప్రోత్సాహకాలనూ వివరిస్తున్నారు.

పెట్టుబడులు పెట్టేవారు, పరిశ్రమలు స్థాపించేవారూ కరెంట్‌తో పాటూ నీటి లభ్యత చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించింది. శామీర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. గోదావరి, కృష్ణా జలాలను ఇక్కడికి తరలించి తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న జనాభాకు పదిరెట్లు పెరిగినా ఢోకా లేదని చెబుతుంది. ఈ తరహా చర్యలతో నగరానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశముంది. దీంతో స్థిరాస్తి మార్కెట్ బాగుంటుందిన నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement