ఈ ఏడాది వందకు మించిన ఎన్‌ఎఫ్‌ఓ దరఖాస్తులు
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి ఎన్‌ఎఫ్‌ఓలు(న్యూ ఫండ్ ఆఫర్లు) వెల్లువెత్తనున్నాయి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పలు సంస్థలు ఎన్‌ఎఫ్‌ఓలకు అనుమతులు కావాలంటూ సెబీకి దరఖాస్తులు సమర్పించాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్‌ఎఫ్‌ఓల కోసం చేసిన దరఖాస్తుల సంఖ్య వందకు మించిపోయింది. వీటిల్లో కొన్నింటికి అనుమతులు లభించి, స్కీమ్‌లు ప్రారంభమయ్యాయి కూడా.
యూటీఐ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, ఎస్‌బీఐ ఎంఎఫ్ తదితర సంస్థలు ఎన్‌ఎఫ్‌ఓల కోసం దరఖాస్తులు సమర్పించాయి. కాగా ఈ ఎన్‌ఎఫ్‌ఓల్లో అధిక భాగం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేవే. డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు జోరుగా ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందని, మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. ఇటీవల వచ్చిన ఎన్‌ఎఫ్‌ఓలకు మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు.