న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ విక్రయ అంశంలో సరిగ్గా వ్యవహరించడం లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు హర్‌పాల్ సింగ్, సబీనా వైసోహా సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నలుగురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. ఇద్దరు డైరెక్టర్లు తేజీందర్ సింగ్ షేర్గిల్, బ్రయాన్ టెంపెస్ట్ ఇప్పటికే తప్పుకున్నారు.
ఈ నలుగురినీ తప్పించే అజెండాతో మంగళవారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్‌హోల్డర్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ విక్రయం విషయంలో షేర్‌హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఈ నలుగురు డైరెక్టర్లు చర్యలు తీసుకోలేదని కంపెనీ ఇన్వెస్టర్లయిన నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్, ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ ఆరోపిస్తున్నాయి. ఆ నలుగురిని తప్పించడంపై వోటింగ్ కోసం మే 22న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఇవి డిమాండ్ చేశాయి.
అదే సమయంలో సువలక్ష్మి చక్రవర్తి, రవి రాజగోపాల్, ఇంద్రజిత్ బెనర్జీలను కంపెనీ బోర్డులో డైరెక్టర్లుగా నియమించేందుకు కూడా ఈ సమావేశంలో వాటాదారుల అనుమతి కోరనున్నారు. ఈ రెండు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకూ.. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 12.04 శాతం వాటాలున్నాయి. ముంజాల్– బర్మన్‌ల కుటుంబ సంస్థలు, మణిపాల్– టీపీజీ, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ మొదలైనవి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. వీటిలో ముంజాల్– బర్మన్‌ల బిడ్‌కు ఫోర్టిస్ బోర్డు ఓకే చెప్పడం వివాదానికి దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment