రెస్సో ఇండియా మ్యూజిక్ కంటెంట్ అండ్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ హరి నాయర్
సాక్షి, ముంబై: దిగ్గజ సోషల్‌మీడియా యాప్‌లకు దడ పుట్టిస్తున్న టిక్‌టాక్ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లకు షాకిచ్చేలా ప్రపంచంలోనే టాప్ 10 యాప్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న టిక్‌టాక్ తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ‘రెస్సో’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారతదేశంలో దీన్నిలాంచ్ చేసింది.
కొత్త తరం సంగీత ఔత్సాహికులకోసం సరికొత్తగా దీన్ని రూపొందించామని సంస్థ వెల్లడించింది. వినియోగదారులు, సంగీత కళాకారులు సంగీతం ద్వారా కనెక్ట్ అవ్వడానికి, వారు పరస్పరం ఒకరితో ఒకరు మమేకం కావడానికి రెస్సో వీలు కల్పిస్తుందని రెస్సో ఇండియా మ్యూజిక్ కంటెంట్ అండ్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ హరి నాయర్ ప్రకటించారు. ప్రేక్షకులు, వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో తెలుసు, అందుకే మెరుగైన సామాజిక స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చామన్నారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలో మొదటిదనీ, ఇలాంటిది మార్కెట్లో లేదని నమ్ముతున్నామన్నారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలోమ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ మధ్య దీర్ఘకాలిక అంతరాన్నిపూరించేందుకు తీసుకొచ్చిన మొదటి విప్లవాత్మక యాప్ అని పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు మాత్రమే పరిమితం కాకుండా కళాకారులకు కూడా విస్తరించి, శ్రోతలతో పరిచయానికి, సరికొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తెలిపారు. అలాగే సంగీతంతో పాటు పాటలు, సాహిత్యం, వీడియోలు, ప్లేలిస్ట్ లాంటి వాటితో ‘వైబ్స్' టూల్‌ను సృష్టించుకోవచ్చు. తమ అనుభవాన్ని పంచుకోవచ్చు. ప్రతి పాటతో సాహిత్యం లిరిక్స్ ప్లే ఉంటుందనీ, తద్వారా కస్టమర్లు పాటలు పాడుకోవడానికి కూడా అనుమతిస్తుందని తెలిపారు.
సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌ట్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, మెర్లిన్ అండ్ బిచ్చర్స్ గ్రూప్, టీ-సిరీస్, సారెగామా, జీ మ్యూజిక్, వైఆర్ఎఫ్ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్, టిప్స్, వీనస్, షెమరూ, స్పీడ్ రికార్డ్స్, ఆనంద్ ఆడియో, లాహిరి మ్యూజిక్, డివో, ముజిక్ 247 లాంటి గ్లోబల్, స్థానిక, స్వతంత్ర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రెస్సో యాప్ రియల్ టైమ్ మ్యూజిక్ లిరిక్స్ ని చూపిస్తుందనీ, వినియోగదారులు వారి కామెంట్స్‌ను ఆ పాటల క్రింద పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. టిక్‌టాక్ ఫీచర్ లాగే ఇందులో మ్యూజిక్ తో కూడిన జీఫ్ లను, వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశాన్నికూడా కల్పిస్తుంది.
దీని సేవలు ఉచితం. అయితే ప్రీమియం నెలవారీ చందా ఆప్షన్‌లో ఆండ్రాయిడ్ కోసం రూ .99, ఐఓఎస్ రూ. 199గా ఉంది. యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్, అధిక-నాణ్యత గల ఆడియో వంటి అదనపు ఫీచర్ల చందా ఆండ్రాయిడ్‌కు రూ .99, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌కు రూ .119 ధర నిర్ణయించింది. కాగా ఆపిల్ మ్యూజిక్, గానా, ప్రైమ్ మ్యూజిక్, జియోసావ్న్, స్పాటిఫై , యూట్యూబ్ మ్యూజిక్ లాంటి యాప్‌లు మార్కెట్లో తమ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment