న్యూఢిల్లీ : టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అనుకున్నంత పని చేసేసింది. టెల్కోలకు షాకిస్తూ ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును సగం తగ్గించేసింది. కాల్స్ స్వీకరించేందుకు గాను, లోకల్ నెట్‌వర్క్‌లకు ఇంటర్నేషనల్ ఆపరేటర్ చెల్లించే టర్మినేషన్ రేటును నిమిషానికి 30 పైసలకు తగ్గిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ రేటు 53 పైసలుగా ఉండేది. ఇంటర్నేషనల్ టర్మినేషనల్ రేటును తగ్గిస్తున్నట్టు రెగ్యులేటరీ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని టాప్ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లకు భారీగా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. వీటిపై విధించే ఛార్జీలతో కంపెనీలు బాగానే రెవెన్యూలను పొందుతున్నాయి. ప్రస్తుతమున్న ఛార్జీలే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ ఛార్జీలను ఒక్క రూపాయికి, అనంతరం రూ.3.50 కు పెంచాలని ఈ కంపెనీలు అంతకముందు కోరాయి. కానీ వీటికి షాకిస్తూ ఈ ఛార్జీలను సగం తగ్గించేసింది. ట్రాయ్ ఈ నిర్ణయంతో కంపెనీలు భారీగా తమ రెవెన్యూలను కోల్పోయే అవకాశముంది.
ఇప్పటికే దేశీయంగా మొబైల్ టర్మినేషన్ రేటును తగ్గించడంతో, టెల్కోల ఆదాయానికి భారీగా గండికొడుతోంది. టర్మినేషనల్ ఛార్జీలను తగ్గించడంతో, దేశీయంగా కాల్ టారిఫ్‌లలో మధ్యవర్తిత్వాన్ని తగ్గించవచ్చని ట్రాయ్ చెబుతోంది. దీంతో అక్రమ వీఓఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) గేట్‌వే బిజినెస్‌లకు చెక్ పెట్టొచ్చని పేర్కొంటోంది. ఇలా ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌లో గ్రే మార్కెట్‌ను నిర్మూలించవచ్చని తెలిపింది. గ్రే మార్కెట్ ద్వారా దేశ భద్రతకు భారీగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అంతేకాక రెవెన్యూలు లీకవుతాయని ట్రాయ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్‌కాల్ టర్మినేషనల్ ఛార్జీలను నిమిషానికి 0.53 పైసల నుంచి 0.30 పైసలకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఈ ఛార్జీల తగ్గింపుతో టెలికాం కంపెనీలు తమ రెవెన్యూల నుంచి 5వేల కోట్ల రూపాయల వరకు కోల్పోయే అవకాశముందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment