సీఫుడ్‌ నాణ్యత పరీక్ష.. విశాఖలో | TUV SUD in India - Testing, Certification, Auditing and Training services | Sakshi
Sakshi News home page

సీఫుడ్‌ నాణ్యత పరీక్ష.. విశాఖలో

Published Wed, Mar 1 2017 12:55 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

TUV SUD in India - Testing, Certification, Auditing and Training services

జర్మన్‌ దిగ్గజం ‘టువ్‌ సుడ్‌’ కార్యకలాపాలు షురూ
యూరప్‌లో గడిచిన ఏడాదిగా పెరిగిన తనిఖీలు
ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలకు సేవలు...


సాక్షి, బిజినెస్‌ బ్యూరో: చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టింది పేరు. ఉభయగోదావరి జిల్లాల్లో రొయ్యల సాగైతే చెప్పనక్కర్లేదు. కాకపోతే వీటిలో చాలావరకూ అమెరికా, యూరప్‌ దేశాలకు ఎగుమతి చేసేవే!!. అయితే ఏడాది కిందటి వరకూ యూరప్‌కు వెళ్లిన కంటెయినర్లను అక్కడి సముద్ర సరిహద్దు భద్రత సిబ్బంది పదింట్లో ఒకటి చొప్పున తనిఖీ చేసేవారు. అంటే 10 శాతమన్న మాట. వీటిలో తిరస్కరణకు గురయ్యేవి ఎక్కువవుతుండటంతో... అప్పటి నుంచి ప్రతి రెండింట్లో ఒక కంటెయినర్‌ను తనిఖీ చేయటం మొదలెట్టారు. దీన్నే వ్యాపారావకాశంగా భావించి, అటు పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జర్మన్‌ టెస్టింగ్‌ దిగ్గజం ‘టువ్‌ సుడ్‌’ రంగ ప్రవేశం చేసింది.

తూర్పు భారతం మొత్తానికి సేవలందించేందుకు విశాఖ కేంద్రంగా అత్యాధునిక ల్యాబ్‌ను ఆరంభించింది. కేంద్రానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌ ఇన్‌స్పెక్షన్‌ కౌన్సిల్‌ అనుమతివ్వటంతో లాంఛనంగా వాణిజ్య కార్యకలాపాల్ని మొదలెట్టింది. ఏటా 220 బిలియన్‌ యూరోల టర్నోవర్‌ను నమోదు చేస్తున్న ఈ జర్మన్‌ దిగ్గజానికి ప్రపంచ వ్యాప్తంగా 1860 ల్యాబొరేటరీలుండగా ఒక్క భారత్‌లోనే 34 వరకూ ఉన్నాయి. నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సాఫ్ట్‌వేర్, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు... ఇలా అన్నిటినీ పరీక్షించే ఈ సంస్థకు... ఆహారోత్పత్తుల్ని పరీక్షించే ల్యాబ్‌లు దేశంలో మూడే ఉన్నాయి. ఒకటి విశాఖ కాగా... మిగిలిన రెండూ గుర్గావ్, బెంగళూరులో ఉన్నాయి.

‘‘దేశంలో ఒకో క్లస్టర్‌ ఒకో దానికి ప్రసిద్ధి. బెంగళూరు తీసుకుంటే అక్కడ పళ్లు, కూరగాయల సాగు ఎక్కువ. ఏపీ, ఒడిశా, బెంగాల్, తెలంగాణను తీసుకుంటే సీ–ఫుడ్‌తో పాటు çపసుపు, మిర్చి ఇతర సుగంధ ద్రవ్యాల సాగు అధికం. అందుకని వీటిని పరీక్షించే సదుపాయం ఇక్కడే ఉంటే ఎగుమతి దార్లకు డబ్బు, సమయం కలిసొస్తాయనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం’’ అని సంస్థ దక్షిణాసియా వ్యవహారాల అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ జైమిని తెలియజేశారు. మంగళవారమిక్కడ సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ దేశాల్లోని దిగుమతిదారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడి ఉత్పత్తులున్నాయో లేదో తాము పరీక్షిస్తామని చెప్పారాయన.

ఏంటీ పరీక్షలు?
వ్యవసాయ, డైయిరీ ఉత్పత్తులతో పాటు ప్రాసెస్డ్‌ ఫుడ్, సీ–ఫుడ్, మాంసం, కాస్మెటిక్స్‌ వంటి ఉత్పత్తుల్లో విషపూరిత పదార్థాలేమైనా ఉన్నాయా? వాటిలో పోషక విలువలెంత? వాటితో అలర్జీలేమైనా వస్తాయా? వంటి అంశాలన్నిటినీ పరీక్షల్లో తెలుసుకోవచ్చు. ‘‘వాల్‌మార్ట్, మెట్రో వంటి దిగ్గజాలన్నీ మా క్లయింట్లే. వాళ్లు ఇక్కడి సీఫుడ్‌ను దిగుమతి చేసుకుని అక్కడ విక్రయిస్తారు. అందుకని తనిఖీలు మాకు అప్పగిస్తారు. మేం ఎగుమతిదారు తాలూకు ప్లాంటుకు వెళ్లి, తనిఖీలు చేసి, దగ్గరుండి కంటెయినర్లలోకి లోడ్‌ చేయించటం వంటివి కూడా చేస్తాం’’ అని జైమిని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల సామాన్య జనం కూడా తాము తాగే నీరు ఎంత సురక్షితమైనదో తెలుసుకోవటానికి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలియజేశారాయన. పరీక్షలకు సంబంధించి భారత్‌లో, విదేశాల్లో రకరకాల ప్రమాణాలు పాటిస్తున్నారని... హెచ్‌ఏసీసీపీ, ఐఎస్‌ఓ 22000, ఐఎస్‌ఓ 9001, జీఎంపీ ప్లస్‌ వంటి పలు ప్రమాణాలకు అనుగుణంగా తాము పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారాయన.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబొరేటరీలు 120 వరకూ ఉండగా... అనుమతి లే నివి చాలా ఉన్నాయని, ల్యాబ్‌లలో పరికరాల్ని బట్టి పరీక్షలకు ఎంత సమయం పడుతుంది? దాని ఖచితత్వమెంత? అనేవి తెలుస్తాయని చెప్పారాయన. దేశవ్యాప్తంగా తమ ల్యాబ్‌లలో నెలకు 12,000 శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. ‘‘దేశంలో సీ–ఫుడ్‌ ప్రధానంగా ఎగుమతయ్యేది విశాఖ పోర్టు నుంచే. దీన్లో 26 శాతం అమెరికాకు, 22 శాతం యూరప్‌కు వెళుతోంది. అందుకని నాణ్యత ప్రమాణాలు పాటించటం తప్పనిసరి. నాణ్యత పాటిస్తేనే ఉత్పత్తి విలువ పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement