
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి యూరప్‌కు వేరుశనగ విత్తనాలు ఎగుమతి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జర్మనీ – నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కూరగాయల విత్తనోత్పత్తి చేసే కంపెనీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమస్థానమని, గత మూడేళ్లుగా దేశంలో వేరుశనగ ఉత్పత్తిలో రికార్డు సాధిస్తున్నామని తెలిపారు.
నెదర్లాండ్స్‌లో అధిక వినియోగం
నెదర్లాండ్స్‌లో వేరుశనగ వాడకం అధికమని, ఆ దేశానికి ఆస్ట్రేలియా నుంచి అధికంగా దిగుమతి అవుతుందన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ ముంబయి, ఢిల్లీల్లో ఉండే దళారులు, మధ్యవర్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. దీంతో రైతుకు సరైన లాభం రావడం లేదన్నారు. ఇలా కాకుండా నేరుగా విదేశాలకు వేరుశనగ ఎగుమతి చేస్తామన్నారు. వేరుశనగను యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇండోనేసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. డిసెంబరులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించి వేరుశనగ ఉత్పత్తికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ తో సమావేశం అవుతామని నెదర్లాండ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment