కాంగ్రెస్‌పై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం
రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలను మానాలి
ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
రాజ్యాంగాన్ని అపహాస్యం చేయవద్దని కాంగ్రెస్ అగ్రనేతకు లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ, మరో వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరించిందన్నారు. రాజ్యాంగ నియమాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభా పక్షాలు బీఆర్‌ఎస్‌లో విలీనమయ్యాయని వివరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుతుండగా, రాహుల్‌గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్వంద్వ విధానాలకు రాహుల్ గాంధీ స్వస్తి పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం 33 శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. దీనిని బట్టే బీఆర్‌ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ ఆగడాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం
పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టు కుని దానినే అపహాస్యం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో శనివా రం రాహుల్ గాంధీకి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ .. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశి్నస్తామని, రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్‌ను బీజేపీ ఇక్కట్లకు గురిచేసిన సందర్భంలో పారీ్టలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment