ఈ ఏడాదే మార్కెట్లోకి టీవీఎస్ ‘అకూల 310’
♦ 2016-17లో 12 శాతం వృద్ధి లక్ష్యం
♦ కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న టీవీఎస్ మోటార్ కం పెనీ స్పోర్ట్స్ బైక్‌ల విభాగంలో వేగం పెంచింది. ఇటీవలే అపాచీ ఆర్‌టీఆర్ 200 మోడల్‌ను ఆవిష్కరించిన ఈ సంస్థ అకూల 310 పేరుతో మరో స్పోర్ట్స్ బైక్‌ను తేబోతోంది. బీఎండబ్ల్యు గ్రూప్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ మోటారాడ్‌తో కలసి టీవీఎస్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది చివరికల్లా భారతీయ రోడ్లపై అకూల దూసుకెళ్లనుందని టీవీఎస్ మోటార్ సేల్స్, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ జేఎస్ శ్రీనివాసన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త టీవీఎస్ విక్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టర్ బైక్‌లు నెలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1,500, దేశవ్యాప్తంగా 15 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు.
పరిశ్రమ కంటే రెండింతలు..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి రేటు 6 శాతం ఉండొచ్చని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే టీవీఎస్ 12 శాతం వృద్ధి నమోదు ఖాయమని అన్నారు. విక్టర్, ఎక్స్‌ఎల్ 100 మోడళ్లు కంపెనీ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. భారత స్కూటర్ల మార్కెట్లో 15 శాతం, మోటార్ సైకిళ్ల విపణిలో 14 శాతం వాటాను టీవీఎస్ కైవసం చేసుకుంది. విక్టర్ రాకతో ఎగ్జిక్యూటివ్ క్లాస్ మోటార్‌బైక్స్ విభాగంలో కంపెనీ వాటా 2 శాతం అధికమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2002 నుంచి విజయవంతంగా ఈ బైక్ అమ్ముడవుతోందని వివరించారు. ఎక్స్‌ఎల్ 100 మోపెడ్స్ నెలకు దేశవ్యాప్తంగా 64,000 యూనిట్లు విక్రయమవుతున్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో విక్టర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.51,900 నుంచి ప్రారంభం.