
శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ తన యూజర్లకు త్వరలో గుడ్‌న్యూస్ అందించనుంది. ట్వీట్ నిడివిని పెంచేదిశగా సంస్థ ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో ఉన్న 140అక్షరాల పరిధిని రెట్టింపు చేసే ప్రయోగాన్ని ప్రారంభించింది.
ట్విట్టర్‌లో సాధారణంగా యూజర్లు ట్వీట్, రిప్లై చేసే టెక్ట్స్ నిడివి ఇప్పటికి 140 క్యారెక్టర్లు మాత్రమే. ట్విట్టర్ తాజాగా చేపట్టిన ఈ ప్రయోగం సపలమైతే యూజర్లు తమ ట్వీట్లను 280కారెక్టర్లకు పెంచుకోవచ్చు. ట్వీట్ ప్రాజెక్ట్ మేనేజర్ అలీజా రోసెన్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇకుహిరో ఇహారా బ్లాగ్ ద్వారా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న సదుపాయాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపారు. చైనా, కొరియా, జపాన్ భాషల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్టు ట్విట్టర్ తెలిపింది. అయితే ఈ ప్రయోగంలో ఎంతమందికి అవకాశం ఉందనే వివరాలు అందించడానికి నిరాకరించింది.